బీఆర్ఎస్‌తో దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సీఎం కేసీఆర్. బీజేపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు. దేశం నలుమూలల పార్టీని విస్తరించేందు ప్రణాళికలు సిద్ధం చేసి పక్కాగా అమలు చేస్తున్నారు. ముందుగా తెలంగాణ పక్కరాష్ట్రాలైనా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటకలను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి పలువురు నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రధానంగా మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అక్కడ దూకుడు పెంచారు. నాందేడ్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి భారీగా జనసమీకరణ చేశారు. అ సభా వేదిక నుంచే మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హామీలిచ్చేశారు. తమను ఆశ్వీర్వదించాలని కోరారు.
బీఆర్ఎస్ నేతలు కూడా రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో పర్యటించి పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆపరేషన్ బీఆర్ఎస్ చేపట్టి నాయకులకు, కార్యకర్తలకు గాలాలు వేస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ ఎదురైంది. రాష్ట్రంలోకి బీఆర్ఎస్ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన హెచ్చరించింది. ఆ పార్టీ నేతలు ఉన్నట్టుండి బీఆర్ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. మరాఠాల ఐక్యత, రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ దెబ్బ తీయాలని చూస్తోందని మండిపడుతున్నారు. సరిహద్దు గ్రామాల నేతలను ప్రలోభ పెట్టి తెలంగాణలో వీలీనం చేసుకోవాలనే కుట్ర చేస్తున్నారంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ అధినాయకుడు రాజ్ ఠాక్రే బీఆర్ఎస్ పై మాటెత్తకపోయినా…పార్టీ శ్రేణులు బీఆర్ఎస్‌ను వ్యతరేకించడం గమనార్హం.