ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్నీ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. సంవత్సరం పాటు ప్రజల్లో ఉండి మెప్పు పొందేందుకు ప్రధాన పార్టీలు ఆరాట పడుతున్నాయి. జూనియర్, సీనియర్ రాజకీయ నేతలు తమ భవిష్యత్ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఏ పార్టీలో చేరితే బాగుంటందనే నిర్ణయానికి వచ్చి తమ అనుకూలంగా ఉండే కండువాను మెడలో వేసుకుంటాన్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేసే మహాసేన రాజేష్ (MahaRaasena Rajesh) టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దళిత సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు కండువా కప్పి మహాసేన రాజేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును సీఎం జగన్ దళిత ద్రోహిగా చిత్రీకరించారని ఫైరయ్యారు. దాంతో చంద్రబాబును అపార్థం చేసుకొని..జగన్ గెలుపు కోసం పనిచేసామన్నారు. కానీ ఆ తర్వాత అసలు నిజాలు తెలిశాయన్నారు. నిజమైన దళిత ద్రోహి ఎవరో ప్రస్తుతం తెలుసుకోగలిగామన్నారు. ఓ దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులకు సన్మానం చేసిన వ్యక్తుల్ని ప్రస్తుతం చూస్తున్నామని విమర్శించారు.
చంద్రబాబు హయంలో అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేసిందని ధ్వజమెత్తారు. 2019లో తప్పు చేయకుండా ఉండుంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని.. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుందని చెప్పారు. అమరావతి భవనాలను చూసి ఇడ్లీ పాత్రలని వెటకారం చేశారని.. ఇప్పుడు వాళ్లు హైదరాబాద్ఋలో ఇడ్లీలు అమ్ముకుంటున్నారన్నారు. జగన్ తుగ్లక్ పాలన చూశాక చంద్రబాబు పాలన రామరాజ్యం అని అర్థమవుతోంది అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి వెళ్లి టీడీపీ గెలుపుకు కృషి చేస్తామని రాజేష్ తెలిపారు. చంద్రబాబును సీఎంను చేయడమే తమ లక్ష్యం అని ప్రకటించారు.