రేపే మహాశివరాత్రి.. ఆ రోజు ఏం చేయాలి? - MicTv.in - Telugu News
mictv telugu

రేపే మహాశివరాత్రి.. ఆ రోజు ఏం చేయాలి?

February 28, 2022

మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది. జాగరణ ఎప్పుడెప్పుడు ఉండాలి అని భక్తులు ఎదురుచూస్తున్న పండగ రానే వచ్చింది. ఈ సందర్భంగా మహాశివరాత్రి అంటే ఏమిటి..? మహాశివరాత్రి రోజున ఏం చేయాలి..? జాగరణ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండాలి..? అనే విషయాలను ప్రతి శివయ్య భక్తుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోష వేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరమని పురాణాలు తెలుపుతున్నాయి.

ఉపవాసం అంటే ఉప+ ఆవాసం. అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యపరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేనివాళ్లు ద్రవ పదార్థాలతో, శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్దలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది.

అంతేకాకుండా భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయం. అలాగే, గృహస్థులకు ఆయురారోగ్యపరంగా పుణ్యార్చన పరంగా, శుభఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.

మహా శివరాత్రి రోజున శాస్ట్రోక్తంగా శివయ్యను ఆరాధించినా, ఎలాంటి మంత్రాలూ తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లుపోసినా రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. భక్త కన్నప్ప ఉదంతం ఈ కోవకు చెందినదే.
1.నిత్య.
2. పక్ష.
3. మాస.
4. మహా.
5. యోగ అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. రోజూ శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల, బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించేది మాస శివరాత్రి. అలాగే, మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్ఠమైన మహా శివరాత్రిగా శివపురాణం పేర్కొంటోంది. సాధకుడు తన యోగమహాత్మ్యంతో యోగనిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు.

శివరాత్రి రోజున శివుడి అభిషేకం/ శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, ప్రాధాన్యతతో కూడినదిగా పురాణం/ జ్యోతిష శాస్త్రం తెలియజేస్తున్నాయి. శివుడు అభిషేక ప్రియుడు గనక మహా శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలు ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం వస్తున్నాయని పురణాలు తెలిపాయి.

శ అంటే శివుడు, వ అంటే శక్తి అని శివ పదమణి మాల చెబుతోంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్దివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో గానీ, నమకచమకాలతోగానీ పురుష సూక్తంతోగానీ ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలికి మించని ఓ శివలింగానికి (స్పటిక లింగమైనా/వెండి లింగమైనా) శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో, బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముతూ విషం బయటకు రావడం ఆ విషాన్ని శివుడు తన గరళం నందు నిలిపి ముల్లోకాలను కాపాడటం.. ఇలా కాపాడిన ఆ కాళరాత్రే శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.