mahashivratri 2023 : which type of food can eat in mahashivratri
mictv telugu

శివరాత్రి జాగారం.. ఇవి తింటే మేలు..

February 18, 2023

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. శివునికి అత్యంత ఇష్టమైన మాఘ బహుళ చతుర్ధశి రోజును ప్రతి సంవత్సరం మహా శివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజున శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవిస్తాడు. ఇదే రోజు శివుడు, పార్వతిదేవి వివాహం జరిగిందని కూడా ఉవాచ. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు శివుడే చెప్పాడని పురాణాలూ చెబుతున్నాయి.

రెండు విధానాలు..

ఈ రోజున చాలామంది ఉపవాసం, జాగరణ చేస్తారు. ఇలా చేస్తే శివానుగ్రహం కలుగుతుందని నమ్మకం. రోజంతా ఏం తినకుండా.. అల్పాహారం మాత్రమే తీసుకుని రాత్రంతా నిద్ర పోకుండా భూతాధిపతిని  కొలుస్తారు. శివుడి జాగరణలో రెండు పద్ధతులు ఉన్నాయి. రోజంతా ఉపవాసం వుండి ఆ మరునాటి ఉదయం ఆహరం తీసుకోవడం ఒక పద్ధతి. కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోజనం చేయడం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటి పూట ఏదో ఒకటి తిని.. రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్ని ఏక భుక్తం అంటారు.

ఉపవాస సమయంలో పండ్లు, కూరగాయల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను ఎక్కువగా తీసుకుకోవడం మంచిది. పండ్లు ఎక్కువగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, అలసట ఉండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటి వాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ రసం, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఉపవాసం ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్‌ రిచ్‌ ఫుడ్‌ తీసుకోవాలి. అంటే మల్టీగ్రెయిన్‌ బ్రెడ్‌, పాస్టా, తృణధాన్యాలు తీసుకోవాలి. క్యారట్లు, బంగాళాదుంపలు తినాలి. టమేటాలు, యాపిల్స్‌, అరటపళ్లు, ద్రాక్షలు ఆహారంలో చేర్చుకోవాలి.