భక్తులు కోరిన కోర్కెలను తీర్చే భోళాశంకరుడు ఆనాది దైవం. ఆయన్నుమనసారా పూజించి, ఏ కోరిక కోరినా ప్రసాదిస్తాడు. నిత్యాభిషేక ప్రియుడు కావడంతో పూలు,పత్రం, నీరు ఏది సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అందుకే చాలా మంది భక్తులు శంకరుడికి అతి ఇష్టమైన శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఉపవాసాలు,జాగరం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి శివున్ని కొలుస్తారు. ఎటువంటి పదార్థాలు తీసుకోకుండా నిష్టగా ఉంటారు.
ఇంతకీ ఇలా ఉపవాసం ఉండటం వెనక ఉన్న రహస్యం ఏంటీ..? ఎందుకు కేవలం శివరాత్రి రోజు భక్తులు ఉంటారో తెలుసుకుందాం.. శివరాత్రి రోజు ఉపవాసం వెనక పురాణాల్లో ఒక కథనం ప్రచారంలో ఉంది. క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన గరళాన్ని ఆదిదేవుడు సేవించిన తన కంఠంలో దాచుకుంటాడు. ఇది బయటకు వస్తే సమస్త లోకాలకు ముప్పు. అందుకే శంకరుడు దాన్ని గొంతు నుంచి బయటికి రానివ్వడు. ఆ కాలకూట విషం ఉష్ణం కుక్కుతూ ఉంటుంది. లోకాలను కాపాడేందుకు శివయ్య ఆ బాధను అనుభవిస్తాడు. దాని కారణంగా మూర్ఛిల్లిపోతాడు. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చే వరకూ ఎటువంటి ఆహారం తీసుకోకుండా జాగారం చేస్తారు. ఆయన్నే తలుచుకుంటూ ఉంటారు. అందుకే హాలాహలం మింగిన రోజు శివరాత్రి కావడంతో భక్తులు ఇలా ఆయన కోసం ఉపవాసం చేస్తారు.
దీని వెనక మరో కథనం కూడా ఉంది. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉందట. ఉపవాసం అంటే మనస్సును శివునికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు చెపుతున్నారు. శివ ధ్యానంలో ఉండటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు. ఇలా శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలంటే కచ్చితంగా పొట్ట ఖాళీగా ఉండాలి. అందుకే ఉపవాసం కారణంగా నిద్ర అనేది రాదని.. దీని ద్వారా శివ ధ్యానం సులువు అవుతుందని అంటారు.
ఆరోగ్య రహస్యం :
ఎవరి వాదన ఎలా ఉన్న ప్రస్తుత ఆహారపు అలవాట్లకు ఈ ఉపవాసం మంచి ఫలితం ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్న వయస్సు నుంచే బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఉబకాయంకూడా పెరిగిపోతోంది. అలాంటి వారికి ఇలాంటి ఉపవాసాలు మేలు చేస్తాయని అంటున్నారు. జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా పళ్లు, ఇతర లైట్ ఫుడ్ తీసుకోవాలి. అలాంటి వారు ఈ ఉపవాసం ద్వారా అయినా మంచి ఆహారం తీసుకునే అవకాశం ఉంది. రోజంతా కడుపు ఖాళీగా ఉంచడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ శుభ్రం అవుతుంది. దీని ద్వారా ఇతర అనారోగ్యాల భారిన పడకుండా ఉంటాం.
ఉపవాసం రోజు ఇలా చేయండి :
ఉపవాసం రోజు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రతి రోజు సమయానికి తినే అలావాటు ఉన్నవారికి ఇది కష్టమైన పనే. కానీ శివరాత్రి రోజు ఉపవాసం చేయాలనుకునే వారు ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఆకలి అనే విషయాన్ని మర్చిపోవచ్చు.
- మనసు తిండిపైకి వెళ్లకుండా పనులు పెట్టుకోవాలి.
- శరీరం అలసిపోయేలా కాకుండా తెలికపాటి, సులువైన పనులు చేయాలి.
- స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి గడిపితే కూడా ఉపవాసం సులువుగా చేయవచ్చు.
- ఉపవాసం ఉన్నవారు ద్రవ పదార్థాలు మాత్రం ఎక్కువగా తీసుకోవాలి.
- చిన్న పిల్లలు, వృద్ధులు వీటికి దూరంగా ఉండటమే ఉత్తమం.
- ఉపవాసం ఉన్నవారు ఆకలికి ఆగలేకపోతే తక్కువ మొత్తంలో అల్పాహారం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.