రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా మహేశ్ బాబు హీరోనే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 1,020 మందికి పైగానే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు అవసరమైన సర్జరీలు చేయించాడు. ఇలా కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని అండగా ఉంటున్న మహేశ్ తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు ప్రాణదానం చేశాడు. వారు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా వారికి అవసరమైన సర్జరీలు చేయించాడు. చిన్నారులు కోలుకుని ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిన్నారులు కోలుకుని ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవడంతో నమ్రతా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రా హస్పిటల్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘మరో రెండు గుండెలు మా కుటుంబంలో కలిశాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్ చేయించుకున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం కుదుటపడడంతో వారు డిశ్చార్జ్ అయ్యారని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. క్లిష్ట సమయాల్లో కూడా సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సేవలు అందించినందుకు ఆంధ్రా హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
ఆమె పోస్టును చూసి మహేశ్ అభిమానులు నువ్వు దేవుడివి సామీ అంటున్నారు. ఆపదలో ఉన్నవారికి నువ్వు చేస్తున్న సాయం మరువలేనిది అని తెలిపారు. కాగా, ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్స్‌తో కలిసి మూడున్నరేళ్లలో 1,020కి పైగా చిన్నారులకు మహేశ్ గుండె ఆపరేషన్లు చేయించాడు. తమ చిన్నారులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఎవరైనా మహేశ్‌ను సోషల్ మీడియాలో కోరితే వెంటనే స్పందిస్తూ అవసరమైన ఆరోగ్య సేవలు అందిస్తూ ఆపద్బాంధవుడిగా మారాడు.