ఏ సీఎంనూ అనుకరించలేదు.. మహేశ్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

ఏ సీఎంనూ అనుకరించలేదు.. మహేశ్ బాబు

April 18, 2018

‘భరత్ అనే నేను..’ ఇప్పుడు టాలీవుడ్ దృష్టి అంతా అతనిపైనే ఉంది. ఈ నెల 20న థియేటర్లపైకి రానున్న ఈ సినిమా కోసం ప్రేక్షుకులు ఎదురు చూస్తున్నారు. పొలిటికల్ డ్రామాతో తెలుగులో సినిమా రాక చాలారోజులైంది. ఈ కొరతను తీరుస్తూ వస్తున్న భరత్ అనే నేను కథానాయకుడు మహేశ్ బాబుతో మైక్ టీవీ జరిపిన ముచ్చట ఇది..

సీఎం పాత్ర కోసం మోల్డ్ అవటం కోసం మీ ప్రిపరేషన్ ఏంటి ?

ఎవర్నీ ఇమిటేట్ చేయలేదు. మా బావ అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు చూసి ప్రిపేర్ అయ్యాను. బాధ్యతగల పాత్ర ఇది. సంవత్సరంన్నర ఈ సినిమాతో ప్రయాణం చేశాను.

మీకు ఇది మాస్టర్ పీస్ అవుతుందని ఎప్పుడు అనిపించింది ?

శివ గారు నాకు కథ చెప్పినప్పుడే అనుకున్నాను. ఒకరోజు రెండు గంటలు చెప్పారు. ఇంకొక రోజు రెండు గంటలు కథ చెప్పారు. మంచి పకడ్బందీ స్క్రిప్ట్ ఇది. సినిమా మొదటి నుంచి చివరి వరకు శివ గారు చాలా పక్కాగా డిజైన్ చేశారు. దేవీశ్రీప్రసాద్ ట్యూన్ ఇచ్చినప్పుడే నమ్మాను.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా రాజకీయంగా ప్రభావం చూపుతుందా ?

అలాంటిది ఏమీ వుండదు. చూసిన నాయకులందరూ మెచ్చుకుంటారు. సరదాగా చూసే మెసేజ్ సినిమా ఇది. పొలిటికల్ సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇది డిఫరెంట్ పొలిటికల్ సినిమా  అవుతుంది.

ఈ సినిమా హిట్ అవాలని ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారా ?

తప్పకుండా వుంటుంది. ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అవ్వాలనే కోరుకుంటాం. ప్రెజర్ డెఫనెట్‌గా వుంటుంది. ఈ సినిమా విడుదల కోసం అందరం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం.

ప్రతీ రాజకీయ  పార్టీకి ఒక ఐడియాలజీ వుంటుంది.. మరి ఈ సినిమాలో మీ ఐడియాలజీ ఏంటి ?

ప్రామిస్ అనే ఐడియాలజీ మీద వెళుతున్నాం. ప్రామిస్ చేశాక మాట తప్పకూడదని మొదటి టీజర్ నుంచి చెబుతున్నాం.

హీరోయిన్ గురించి ?

పొలిటికల్ సినిమా అనుకున్నప్పుడు పెద్ద హీరోయిన్ అయితే బాగుండదు.. కొత్త అమ్మాయి అయితేనే బాగుంటుందని నేనే శివ గారికి చెప్పాను. ‘ఎమ్ఎస్ ధోని’ సినిమాలో కైరా అద్వానీని చూసి సెలెక్ట్ చేశాం.

నటుడిగా మీ నాన్నగారి ప్రభావం మీపై ఎంత వరకు వుంది?

కచ్చితంగా వుంటుంది. ఈ సినిమా విషయంలో ఎక్కువ వుందనే చెప్పాలి. నా డైలాగులు విని చాలా మంది నాన్న వాయిస్‌లానే వుందని అన్నారు. చాలా సంతోషంగా వుంది.

ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పండి.

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్ చెప్పాలి. స్పెషల్‌గా డిఓపీ రవి కె. చంద్రన్ తిరులు బాగా పని చేశారు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ అసెంబ్లీ సెట్ వేసిన విధానం అత్యద్భుతం. చాలా తొందరగా సెట్ వేశారు. దేవీశ్రీ ప్రసాద్ కూడా మంచి సంగీతం అందించారు. వీఎఫ్ఎక్స్ యుగంధర్ కూడా బాగా కష్టపడ్డారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పాలి.

మీ దృష్టిలో బెస్ట్ సీఎం ఎవరు?  

కంట్రవర్సీ వద్దు సర్ ( నవ్వుతూ ). రెండు రోజుల్లో సినిమా విడుదల అవుతుంది ఎందుకు కాంట్రవర్సీలు చెప్పండి.

సోషల్ మీడియా ప్రభావం మీ సినిమా మీద ఎంతవరకు పడుతుందనుకుంటున్నారు?

సోషల్ మీడియా చాలా హెల్ప్ అవుతుందని నమ్ముతాను. ఇంతకు ముందు టీవీల్లో వచ్చింది పేపర్లలో వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది టీవీల్లో వస్తోంది.

మీరు చరణ్, ఎన్టీఆర్ మిత్రులు కదా.. కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారు?

సినిమాలు తప్పించి బయట కుర్రాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో అలాగే మాట్లాడుకుంటాం. మేం కూడా కలిసినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది.

సందీప్ రెడ్డి వంగా సినిమా వుంటుందా ?

    అదింకా చర్చలో దశలో వుంది.