క్రిప్టో కరెన్సీ మోసం : కంటి ముందు కోట్లు కనిపిస్తున్నా.. ఏం లాభం? - MicTv.in - Telugu News
mictv telugu

క్రిప్టో కరెన్సీ మోసం : కంటి ముందు కోట్లు కనిపిస్తున్నా.. ఏం లాభం?

April 26, 2022

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యక్తి కథ ఇది. ఈ డిజిటల్ కరెన్సీకి ఎలాంటి చట్టబద్ధత లేదని ప్రభుత్వం ప్రకటించినా కొందరు అత్యాశకు పోయి మోసపోతున్నారు. హైదరాబాదు శ్రీనగర్ కాలనీకి చెందిన మహేష్ అనే వ్యాపారస్థుడు కొందరు స్నేహితుల మాట విని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. వారి సూచనల మేరకు ప్రాన్‌డాట్ ఏసీ డాట్ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆశ పెట్టారు. దాంతో మహేష్ వారిచ్చిన టెలిగ్రామ్ లింకు ద్వారా అందులో జాయిన్ అయ్యాడు.

మొదటగా రూ. 30 వేలు పెట్టుబడి పెట్టగా, రూ. 50 వేలు వచ్చాయి. దీంతో అత్యాశతో పలు దఫాలుగా రూ. 80 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. 80 లక్షలకు కోటికి పైగా లాభం వచ్చింది. కానీ సొమ్ము చేసుకోవడం కుదరటం లేదు. కంటికి అంత సొమ్ము కనిపిస్తుంది తప్ప ఒక్క రూపాయ అయినా తీసుకొని వాడుకోవడానికి వీల్లేకుండా పోయింది. దాంతో అది నకిలీ వెబ్‌సైట్ అని గుర్తించి, మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.