ప్రముఖ నటి, మోడల్ పార్వతీనాయర్ తన పనిమనిషి సుభాష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన ఇంట్లో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు పోయాయని నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ సమయంలో పనిమనిషి సుభాష్ మాత్రమే ఇంట్లో ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు సుభాష్ ను విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుభాష్.. నటి ఇంటికి రాత్రిళ్ళు ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని, ఈ విషయం తాను ఎక్కడ బయటపెడతానోననే ఆందోళనతో తనపై చోరీ కేసు పెట్టిందని ఆరోపించాడు.
తాజాగా సుభాష్ ఆరోపణలపై పార్వతీ నాయర్ స్పందించారు. ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆమె ‘అక్టోబరులో మా ఇంట్లో ఖరీదైన వస్తువులు పోయాయి. అప్పుడు నేను షూటింగులో ఉన్నా. చోరీ జరిగినప్పుడు ఇంట్లో సుభాష్ ఉన్నాడని పోలీసులకు చెప్పా. ఆ తర్వాత నుంచి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. మొదట్లో నేను భయపడ్డా కానీ, తర్వాత అతడిని పట్టించుకోలేదు. అతను తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నాడు. నా పరువుకు నష్టం కలిగించేలా ప్రవర్తించినందుకు దావా వేశా. సుభాష్ చెప్పేదంతా అబద్ధం. అతడు తప్పు చేశాడని నాదగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. చట్టప్రకారం ముందుకు వెళ్తా. పనిలో చేరినప్పుడు నేను అనాథ అని చెప్పాడు. ఇప్పుడేమో అతని తరపున వారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నేను పనిచేసే ప్రొడక్షన్ వాళ్లు నన్నడుగుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. మానసికంగా కూడా ఇబ్బందిగా ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.