రేపటి(జూన్ 1) నుండి కొత్త నెల ప్రారంభం కానుంది. ఈ కొత్త నెలలో కొన్ని ఆర్థిక అంశాలలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీనిలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం నుంచి బ్యాంకు సేవింగ్స్, ఎఫ్డీ అకౌంట్ల వడ్డీ రేట్ల వరకు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
• గృహ రుణాలకు వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచనున్నట్టు ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. హోం లోన్లపై ఎస్బీఐ 7.05% వడ్డీని వసూలు చేయనున్నది.
• యాక్సిస్ బ్యాంకు తన సేవింగ్స్ అకౌంట్స్ ఛార్జీలను పెంచబోతుంది. ఈ పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఛార్జీలలో మినిమమ్ బ్యాలెన్స్‌లను నిర్వహించనందుకు విధించే ఛార్జీలతో పాటు అదనపు చెక్ బుక్ ఛార్జీలు కూడా ఉన్నాయి.
• థర్డ్ పార్టీ మోటరు ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు జూన్ 1 నుంచి పెరగనున్నాయి. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. వాహనాలను బట్టి ఈ ప్రీమియం రేట్లలో మార్పులు ఉంటాయి.
• ఏఈపీఎస్ సేవలకు చార్జీ: ఆధార్ సాయంతో నగదు చెల్లింపుల వ్యవస్థ(ఏఈపీఎస్) సేవలకు చార్జీలు వసూలు చేస్తామని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ) ఇప్పటికే ప్రకటించింది. ఇది జూన్ 15 నుంచే అమల్లోకి రానున్నది. అయితే, మొదటి మూడు లావాదేవీలు ఉచితం. తర్వాతి ప్రతి లావాదేవిపై రూ.20+జీఎస్టీ వసూలు చేస్తారు. మినీ స్టేట్మెంట్ చూడాలంటే రూ.5+జీఎస్టీ వసూలు చేస్తారు.