సికింద్రాబాద్ అగ్ని ప్రమాదాలకు అడ్డాగా మారింది. మరో ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు బలయ్యారు. మృతులందరూ పాతికేళ్లలోపు యువతీయువకులే. ప్యారడైజ్ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్సులోని బీఎం5 కాల్ సెంటర్లో గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు, ఇద్దరు యువతులు చనిపోయారు. సాయంత్రం 6.30 గంటలకు మొదలైన మంటలు రాత్రికి చాలా దుకాణాలకు వ్యాపించాయి.
8 అంతస్తుల స్వవ్నలోక్‌లో మొదట ఏడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ వల్ రేగిన మంటలు కింది అంతస్తులకు వ్యాపించాయి. 5వ అంతస్తులో పేలుడు సంభవించి బట్టలషాపులు, కాల్ సెంటర్లు, పలు కార్యాలయాలు కాలిపోయాయి. జనం మంటల వల్ల ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సాయంతో 15మందిని కాపాడారు. వారిలో ఆరుగురి పరిస్థతి విషమంగా ఉండడంతో అపోలో, గాంధీ ఆస్పత్రులకు తరలించారు. ఆరుగురూ ఆస్పత్రుల్లోనే చనిపోయారు. మృతులను ప్రమీల (22), వెన్నెల (22), శ్రావణి(22), త్రివేణి(22), శివ(22), ప్రశాంత్ (23)లుగా గుర్తించారు. స్వప్నలోక్ భవనంలో సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదని ఆరోపణలు వసతున్నాయి. ఇటీవల మినిస్టర్ రోడ్డులోని డెక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం తెలిసిందే.