'Major' is soaring in OTT..Top 1 in Pakistan..
mictv telugu

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘మేజర్’..పాకిస్తాన్‌లో టాప్‌ 1..

July 8, 2022

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌ హీరోగా, సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా దర్శకుడు శశి కిరణ్‌ చిత్రం “మేజర్’. ఈ చిత్రాన్ని 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో విడుదలై, భారీ కలెక్షన్లు రాబట్టింది.

 

అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ సంతోషకరమైన విషయాన్ని హీరో అడివి శేష్‌ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ”నా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘మేజర్’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సైతం రికార్డులను బద్దలు కొడుతుంది. జులై 3 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ టాప్ 1,2 పొజిష‌న్ల‌లో ‘మేజ‌ర్’ కొన‌సాగుతుంది. ‘మేజర్‌’ హిందీ వెర్షన్‌‌లో టాప్‌ 1లో ట్రెండ్‌ అవుతుండగా, తెలుగు వెర్షన్‌‌లో 2వ స్థానంలో ఉంది” అని రాసుకొచ్చారు.

మరోపక్క ఈ సినిమా ఇండియాలో కాదు పాకిస్తాన్‌లో కూడా చరిత్ర సృష్టిస్తుందని చిత్రం బృందం తెలిపింది. పాకిస్తాన్‌లో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన సినిమాల్లో ‘మేజర్‌’ మొదటి స్థానంలో నిలించిందని, బంగ్లాదేశ్‌, శ్రీలంకలో కూడా ఈ చిత్రం టాప్‌ 1లో ఉంందని వివరాలను వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించగా, శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.