మళ్లీ వచ్చిన బుల్డోజర్లు.. ఢిల్లీలో ఉద్రిక్తత.. - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ వచ్చిన బుల్డోజర్లు.. ఢిల్లీలో ఉద్రిక్తత..

May 9, 2022

అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మరోసారి బుల్డోజర్లు దర్శనమిచ్చాయి. అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని సౌత్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఈ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు షహీన్‌బాగ్‌కు బుల్డోజర్లను తీసుకురాగా.. అక్కడి ప్రజలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. కూల్చివేతను అడ్డుకుంటూ భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి పంపించేశారు.

ఈ ఆందోళనలో పాల్గొన్న ఆప్‌ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌.. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను తాము ఇప్పటికే తొలగించామని, అయినా బుల్డోజర్లను పంపించిన బీజేపీ రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జ‌హంగిర్‌పురిలోనూ అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేసిన విష‌యం తెలిసిందే. దీంతో .. అక్కడ ఘర్షణలు చోటుచేసుకోవడంతో సుప్రీంకోర్టు కలగజేసుకుని ఆ ప్రాంతంలో నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది.