అయ్యప్పస్వామి భక్తుల పుణ్యక్షేత్రం శబరిమల కిటకిటలాడుతోంది. దేశం నలుమూలల నుంచి చేరుకున్న లక్షలాది భక్తులు శనివారం పుణ్యప్రదమైన మకరజ్యోతిని దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు కొండపై మకర విళక్కుగా వ్యవహరించే మకరజ్యోతిని దర్శించి భక్తిపారవశ్యంతో పలకించిపోయారు. శబరిమల కొండలు స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో ప్రతినిధ్వనించాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినంలో శబరిమలకు నాలుగు కిలోమీటర్ల దూరంలో మకరజ్యోతి మూడు కనిపిస్తుంది. దీన్ని చూస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అయ్యప్పస్వామే మకరజ్యోతి రూపంలో ప్రత్యక్షమై ఆశీర్వదిస్తాడని చెబుతారు. జ్యోతి దర్శన సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలయ అధికారులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.