‘‘ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా, లేదా అన్నదే ముఖ్యం,’ అంటున్నాయి చిన్న మూవీలు. ఎవరి మద్దతూ లేకుండా, కోట్లకోట్ల పెట్టుబడి జోలికి, స్టార్ల జోలికి పోకుండా, అతి తక్కువ బడ్జెట్‌తో కేవలం కంటెంట్‌నే నమ్ముకుని బాక్సాఫీసులను బద్దలు కొడుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమాలు బొక్కబోర్లాపడుతుంటే ఈ బుల్లి మూవీలు మాత్రం పాన్ ఇండియా విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన కన్నడ కాంతార మూవీ 500 కోట్లను ఎలా కొల్లగొట్టిందో చూశాం. తాజాగా అంతకంటే చాలా చాలా తక్కువ వ్యయంతో నిర్మితమై కోట్లు కొల్లగొడుతోంది మరో సౌతిండియా మూవీ. పేరు ‘రోమాంచం’.
రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ ఇప్పటివరకు 54 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు లేరు, గ్రాఫిక్స్ లేవు, విదేశాల్లో షూటింగులు కూడా లేవు. కేవలం ఓయిజా గేమ్ ఆడేవాళ్ల చుట్టూ తిరిగే కథనే నమ్ముకుని తీశారు. పదిహేనేళ్ల కిందట స్టోరీతో హర్రర్-కామెడీ జోనర్ కింద కథ తయారు చేసుకున్నారు. జితు మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా చిన్న సినిమాల్లాగే కష్టాలు ఎదుర్కొంది. డిస్ట్రిబ్యూటర్లు పెదవి విరిచారు. ఎలగోలా తిప్పలుపడి ఫిబ్రవరి 3న విడుదల చేశారు. అప్పట్నుంచి కేరళలో ఎక్కడా విన్నా రోమాంచమే. 54 కోట్లు రాబట్టిన ఈ మూవీ మరో రెండు నెలల్లో వంద కోట్ల గ్రాస్ సాధిస్తుందని చెబుతున్నారు. ఇంత హిట్ మూవీకి తమదైన టాలీవుడ్ టచ్ ఇచ్చి హిట్ కొట్టడానికి తెలుగు నిర్మాతలు రైట్స్ కోసం ఇప్పటికే బేరసారాలు నడిపిస్తున్నారు. జితు మాధవన్‌కు ఇది తొలి సినిమా కావడం విశేషం.