క్వారంటైన్‌ రూల్స్ బ్రేక్.. భారతీయుడికి 5 నెలల జైలు - MicTv.in - Telugu News
mictv telugu

క్వారంటైన్‌ రూల్స్ బ్రేక్.. భారతీయుడికి 5 నెలల జైలు

August 13, 2020

Malaysia jails Indian man linked to fresh coronavirus outbreak.

కరోనా వైరస్ సోకినవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. వారి అజాగ్రత్త వల్లే కరోనా వ్యాప్తి చెందుతుంది. అయితే కొందరు క్వారంటైన్ కేంద్రాల నుంచి పారిపోతున్న ఘటనలు చూస్తున్నాం. కొందరు బోర్ కొట్టి, మరికొందరు వ్యసనాలకు బానిసై పారిపోతున్నారు. అదెంత ప్రమాదమో గ్రహిస్తే బహుశా వారు ఆ తప్పు చేయరేమో. ఈ క్రమంలో మలేషియాలో ఓ భారతీయుడు క్వారెంటైన్ నిబంధనలు ఉల్లంఘించాడు. అంతేకాదు ఇతరులకు కరోనా అంటించాడు. దీంతో అతన్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనకకు నెట్టారు. 57ఏళ్ల వయసున్న భారతీయుడు గత కొన్నేళ్లుగా మలేషియాలో నివసిస్తున్నాడు. కేదా రాష్ట్రంలో ఆయన ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఆయన కరోనాకు ముందు భారత్‌కు  వచ్చి లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకున్నాడు. 

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఆయన గత నెలలో తిరిగి మలేషియా వెళ్లాడు. మలేషియా అధికారులు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది.. అయినా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆయనకు సూచించారు. అయితే ఆయన మాత్రం.. క్వారెంటైన్ నిబంధనలను ఉల్లంఘించి తన రెస్టారెంట్‌కు వెళ్లాడు. తనకు ఎలాగూ కరోనా లేదు కదా అనే ధీమాతో తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతను రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలుసుకున్నారు. అతనికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా అతని కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ సిబ్బందికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  దీంతో అధికారులు ఆ పెద్దాయన మీద సీరియస్ అయ్యారు. క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించి.. మరికొందరికి కరోనా అంటించాడని సదరు భారతీయుడికి అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విచారణలో ఆ వ్యక్తి తప్పు ఒప్పుకోవడంతో.. కోర్టు అతనికి 5 నెలల జైలుశిక్ష విధించింది. అంతేకాకుండా దాదాపు 3వేల డాలర్ల జరిమానా విధించింది. కాగా, మలేషియాలో ఇప్పటివరకు దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నమోదవగా.. 125 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.