తోక ముడిచిన మలేసియా.. తాము చిన్నోళ్లమన్న మహతీర్  - MicTv.in - Telugu News
mictv telugu

తోక ముడిచిన మలేసియా.. తాము చిన్నోళ్లమన్న మహతీర్ 

January 20, 2020

ghdbg

భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం తాము  కాదని మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య నెలకొన్ని వాణిజ్యపమైన సందిగ్ధతపై ఆయన ఈ విధంగా స్పందించారు. తాము భారత్ ముందు చిన్నవాళ్లం అంటూ పేర్కొన్నారు భారత్ తమ దేశంలో పండే పామాయిల్ దిగుమతిని నిలిపివేసినప్పటికీ తాము ఎటువంటి ప్రతికార చర్యలకు పాల్పడమని తేల్చి చెప్పారు. తమ దేశంలో నెలకొన్న ఇబ్బందులపై ప్రత్యామ్నాయాలు చేస్తున్నట్టు మహతీర్ వెల్లడించారు. 

ఇటీవల భారత ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై మలేషియా ప్రధాని విమర్శలు చేశారు. ఇది సరైన నిర్ణయం కాదంటూ ఆయన ఆక్షేపించారు. దాంతో కేంద్ర ప్రభుత్వం మలేషియా నుంచి పామాయిల్ దిగుమతులను నిలిపివేసింది. ఈ చర్యతో ఆ దేశంలో దాదాపు 10 శాతం మేర ఎగుమతులు పడిపోయాయి. వాణిజ్యపరమైన ఒడిదుడుకులు ఏర్పడటంతో తీవ్ర నష్టాలను ఆ దేశం మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది. నూతన దిగుమతిదారుల కోసం ఆ దేశం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. 

కాగా చాలా కాలంగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మహతీర్ తప్పుబడుతూనే ఉన్నారు.  అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని భారత్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవల  సీఏఏ ప్రవేశపెట్టడం సరైంది కాదని మరోసారి అభిప్రాయపడ్డారు. వివాదాస్పద మత ప్రబోధకుడు జాకీర్‌ నాయక్‌ అప్పగించాలని ఎన్నిసార్లు భారత ప్రభుత్వం మలేషియాను కోరినా పట్టించుకోలేదు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి.