యుద్ధ విమానాల వ్యాపారంలో భారత్.. అమెరికా సహా 6 దేశాల ఆర్డర్లు
ఇంతవరకూ యుద్ధ విమానాల కోసం దిగుమతుల పైనే ఆధారపడిన భారత్ ఇప్పుడు ఆ రంగంలో స్వయం సమృద్ధి సాధించింది. అంతేకాక, అగ్రరాజ్యం అమెరికా సహా ఆరు దేశాలకు వాటిని ఎగుమతి చేయనుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాల పట్ల అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ ఆసక్తి చూపిస్తున్నాయని పార్లమెంటులో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. అలాగే 2019లో ఆర్డర్ ఇచ్చిన మలేషియా త్వరలో వాటిని కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. ఇక ఎగిరే శవపేటికలుగా పేరొందిన మిగ్ 29 ఫైటర్ జెట్ల స్థానంలో తేజస్ యుద్ధ విమానాలను ప్రవేశ పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. ఇదికాక, స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. ‘అటానమస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్’ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని స్పష్టం చేసింది. కాగా, సొంత అవసరాల కోసం భారత్.. రూ. 48 వేల కోట్లతో తేలికపాటి తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం హెచ్ఏఎల్‌తో గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది.