బచ్చలికూర….దీని గురించి చాలా మందికి అసలు తెలియనే తెలియదు. ఇంట్లో ఈజీగా పెరిగే ఈ మొక్క గురించి కానీ, దీనితో చేసుకునే వంటకాల గురించి కానీ పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బచ్చలికూర ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు. వారానికి ఒకసారైనా దీన్ని తినాలని అంటున్నారు.
బచ్చలికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సీ, ఏ, కె, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సెలీనియం, నియాసిన్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల్లో కెరోటిన్, లుటిన్, జియాక్సింతిన్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందించేవే.
బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. రక్తహీనత ఉన్నప్పుడు దేనిమీదా దృష్టిపెట్టలేం. అసహనం, చికాకు వేధిస్తాయి. ఎనీమియాతో బాధపడేవారు.. బచ్చలికూరను తరచుగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే బచ్చలికూరలో.. విటమిన్ ఏ మెండుగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారు.. బచ్చలికూర తప్పనిసరిగా తీసుకోవాలి. బచ్చలికూరలోని ల్యూటిన్ కంటి చూపుకు సహాయపడే రెటీనాను మెరుగుపరుస్తుంది.
బచ్చలి కూరలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే..ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, సోడియం, కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఆస్కార్బిక్ యాసిడ్, నియాసిన్, టోకోఫెరోల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. బచ్చలి కూరలో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌కు మృదుత్వ లక్షణాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, హైపర్‌టెన్షన్, కార్డియాక్ స్ట్రోక్ ప్రమాదాలను తగ్గిస్తుంది.
వంద గ్రాముల బచ్చలి కూరలో 92.5 గ్రాముల నీరు ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. బచ్చలికూరలో క్లోరిన్ ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను నిర్వహించడానికి సోడియం, పొటాషియం కణాలతో పని చేస్తుంది. ఇది శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.
ఇవే కాదు బచ్చలికూర జీర్ణవ్యవస్థకూ మేలు చేస్తుంది.మలబద్ధకానికి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. పీచు ఎక్కువ కనుక జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. బచ్చలికూర కాండంలో జీర్ణవ్యవస్థకు మేలు చేసే జిలాటినస్ ఉంటుంది. ఇది డయేరియా సహా, జీర్ణ రుగ్మతుల చికిత్సలో సహాయపడుతుంది.బచ్చలి కూర ఫ్రీరాడికల్ కణాల విడుదల అదుపులో ఉంచుతుంది. దీని కారణంగా కణాలకు జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూర తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే.. అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది.