మగ కోరికలకు కళ్లేలు.. ఈ ఇనుప కచ్చడాలు! - MicTv.in - Telugu News
mictv telugu

మగ కోరికలకు కళ్లేలు.. ఈ ఇనుప కచ్చడాలు!

October 16, 2018

కోరికలు గుర్రాలైతే.. హద్దుమీరితే.. విచక్షణ కోల్పోతే.. ఏమవుతుంది? ఉపద్రవాలు సంభవిస్తాయి. అధికార దాహం ఎలాంటిదో కామ దాహం కూడా అలాంటిదే. ఎంత అందినా కోరిక తీరదు. అందుకే మానవజాతి ముందు జాగ్రత్తగా పెళ్లితో చెక్ పెట్టింది. అయితే కట్టుబాట్లు ఉన్న చోట వాటిని ఉల్లంఘించేవారూ ఉంటారు. వారి కోసం మళ్లీ కొత్త కట్టుబాట్లు వస్తాయి. అవి కూడా పనిచేయకపోతే ఇనుప కచ్చడాలు వస్తాయి.

తాపీ ధర్మరావుగారు వీటి గురించి ఏకంగా పుస్తకమే రాశారన్నది మళ్లీ గుర్తుచేయక్కర్లేదు. అయితే అందులో ముఖ్యంగా ఆడవారి ఇనుప కచ్చడాల గురించే ఉంది. మావవ జాతిలో ఎక్కువగా శీలపరీక్షకు గురయ్యేది స్త్రీనే కనుక వారి కచ్చడాల గురించే చాలామంది రాశారు. అయితే మగవాళ్ల కోరికలకు కళ్లేలు వేసే కచ్చడాలూ చరిత్రలో ఉన్నాయి. పైగా అవి మన భారద్దేశం, చైనా వంటి తూర్పు దేశాల నుంచే పశ్చిమ దేశాలకు ఎగుమతి కావడం గమనార్హం.

అల్లసారి పెద్దనగారి మనుచరిత్రలో మచ్చుకు ఒక ఉదాహరణ ఇంది. ప్రవరాఖ్యుడిని లోబర్చుకోవడానికి వరూధుని నానా తిప్పలు పడుతూ ‘ఇనుప కచ్చడాల్ గట్టుకొను మునిమ్రుచ్చులెల్ల/ తామరస నేత్రలిండ్ల బందాలుగారే?’ అని తేల్చేస్తుంది కదా. అంటే ఆ కాలంలో మునులు లైంగిక వాంఛలను అదుపులో పెట్టుకోవడానికి ఇనుప కచ్చడాలు ధరించేవారని కదా తెలుస్తోంది. తూర్పు దేశాల్లో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కనుక వీటి వాడకం విరివిగా ఉండేదనుకోవాలి.

పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ

అయితే మగవాళ్ల కోరికలకు నడుం వద్దే చెక్ పెట్టే ఈ కచ్చడాలు పాశ్చాత్య దేశాల పురుషుల చరిత్రలో పెద్దగా కనిపించవు. అక్కడ ఆడవాళ్లకే వాటిని బిగించేవారు. క్రూసేడ్ల కాలంలో వీరయోధులు దండయాత్రలకు వెళ్లినప్పుడు తమ భార్యలు, ఇతర ఆడజనం పరాయి పురుషుల సంపర్కరంతో అపవిత్రం కాకుండా కచ్చడాలను పెద్ద సంఖ్యలో తయారు చేయించి, తాళం చెవులను వెంటబెట్టుకుపోయేవారు. ఇవి మూడు వందలేళ్లు  మావన సహజాతాలను చంపేశాయి. అంతేకాకుండా ఆడవారిని అనారోగ్యానికి, చెప్పలేని నరకయాతనకు గురిచేశాయి.

ttt

అయితే కాలం ఒకేలా వుండదు. ఈ అనాగరిక ఆచారం కనుమరుగువుతూ వచ్చింది. అయితే ఆడవాళ్లు వదలించుకున్న కచ్చడాలు తర్వాత మగవాళ్లను పట్టుకున్నాయి. బ్రహ్మచర్యం పేరుతో 19, 20 శతాబ్దాల్లో వీటిని పురుష పుంగవులు, ముఖ్యంగా యువ సన్యాసులు బిగించుకునేవారు. రకరకాల డిజైన్లు ఉండేవి. కథ అంతటితో ఆగిపోలేదు. 21వ శతాబ్దంలోనూ ఇవి ఉనికి చాటుకుంటూనే ఉన్నాయి. శీలపరీక్షలకాలం కాదు కాబట్టి ఇవి మరో దారి వెతుక్కున్నాయి. విశృంఖల శృంగారం కోరుకునే వారు వెరైటీ కోసం వీటిని ఇప్పటికీ వాడుతున్నారు. ఆధునిక టెక్నాలజీని జోడించి వీటికి ఆటోమేటిక్ తాళాలు గట్రా వేయించుకున్నాడు. పుర్రెకో బుద్ధి అన్నట్టు ఎవడి కచ్చడం వారిష్టం.. !

-అన్వేష్

(ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయితవి మాత్రమే.. మైక్ టీవీకి వీటితో సంబంధం లేదు)