మగాళ్లకు కు.ని. చేయించకపోతే ఉద్యోగాలు పోతాయ్.. ప్రభుత్వం  - MicTv.in - Telugu News
mictv telugu

మగాళ్లకు కు.ని. చేయించకపోతే ఉద్యోగాలు పోతాయ్.. ప్రభుత్వం 

February 21, 2020

xdv

మనదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలో అధిక జనాభా ఒకటి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది తగ్గడం లేదు. పోనీ స్థిరంగా ఉందా అంటే, అదీలేదు. రేపోమాపో చైనానుకు కూడా దాటేయబోతున్నాం. పరిమిత వనరులు, పరిమిత భూభాగం ఉన్న మనదేశంలో కుటుంబ నియంత్రణపై ఇంకా చాలామందికి అవగాహన లేదు. మూఢనమ్మకాలు, భయం, అనుమానాలతో చాలా మంది.. ముఖ్యంగా పురుషులు కు.ని. జోలికి వెళ్లడం లేదు. 

దీంతో ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి మగ ఆరోగ్య కార్యకర్త కచ్చితంగా ఒక మగాడికి కు.ని. ఆపరేషన్ చేయించి తీరాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే ఉద్యోగాలు పోతాయని బెదిరించింది. టార్గెట్ ఛేదించలేని వాళ్లకు వలంటరీ రిటైర్మెంట్ ఉంటుందని, లేకపోతే జీతం పెండింగులో పెడతామని సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే తాము అనుకున్నది సాధించుకుంటామని, సర్క్యులర్‌ను సమీక్షించి ముందుకెళ్తామని ఆరోగ్యమంత్రి తులసీరామ్ సిలావత్ తెలిపారు. వాస్తవానికి ఇది తాము తెచ్చిన ఉత్తర్వు కాదని, కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిదని వెల్లడించారు. మధ్యప్రదేశ్ పురుషుల్లో 0.5 శాతం మంది మాత్రమే కు.ని. చేయించుకుంటున్నారు.