తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝులిపిస్తోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతూ వారి భాగోతాలను బయటపెడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ వలకు మరో అధికారి చిక్కారు. మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. దాదాపు రూ. 50 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల వివరాలను సేకరించారు. భూముల సెటిల్ మెంట్లు, ఇతర వ్యవహారాల ద్వారా ఇదంతా సంపాధించినట్టుగా అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఏసీపీగా ఉన్న నరసింహరెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. ఆ సమయంలో భూ తగాదాల్లో కల్పించుకొని సెటిల్ మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన నివాసంతో పాటు 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. వరంగల్లో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండలో రెండు చోట్ల, హైదరాబాద్లోని మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్పేట, ఉప్పల్ ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. కాగా, ఈయన మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డిరి అల్లుడు కావడం విశేషం. కాగా, ఇటీవలే కీసరలో ఓ అవినీతి ఎమ్మార్వో కోటి రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే.