ఖర్గే చేతికి కాంగ్రెస్ పగ్గాలు.. నేడు ప్రమాణ స్వీకారం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఖర్గే చేతికి కాంగ్రెస్ పగ్గాలు.. నేడు ప్రమాణ స్వీకారం..

October 26, 2022

 

Mallikarjun Kharge to take charge as AICC national president today

కాంగ్రెస్‌ అధ్యక్షులుగా మల్లికార్జున్‌ ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 24 ఏళ్ల తరువాత గాంధీయేతర వ్యక్తి అయిన మల్లికార్జున్‌ ఖర్గేకు బాధ్యలు అందజేసే కార్యక్రమం కోసం కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తయియ్యాయి. గాంధీ కుటుంబం నుంచి పోటీ లేకపోవడంతో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మల్లికార్జున్‌ ఖర్గే చేతులో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ ఓటమి చెందారు.

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ప్రస్తుత- మాజీ సీడబ్ల్యూసీ సభ్యులు, ప్రస్తుత – మాజీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ప్రస్తుత – మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత – మాజీ పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత – మాజీ సీఎల్‌పీ లీడర్లు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ఖర్గేకు పార్టీ కేంద్ర ఎన్నికల అధికారి చీఫ్ మధుసూదన్ మిస్త్రీ విజయ ధృవీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కూడా పార్టీ ఆమోదించనుంది. ఆ తర్వాత, ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా పార్టీ నాయకులనుద్దేశించి మల్లిఖార్జున్ ఖర్గే ప్రసంగించనున్నారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి.

భారత్ జోడో యాత్ర చేపట్టిన ఉన్న రాహుల్ గాంధీ.. దీపావళి, మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం కోసం 3 రోజుల విరామం తీసుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఈ విరామం నేటితో ముగియనున్నది. రేపటి నుంచి మళ్లీ తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది.