Mallu Ravi Fires On Sangareddy District Collector Sharat For Calling Cm Kcr As Abhinava Ambedkar
mictv telugu

కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన కలెక్టర్.. మండిపడుతున్న కాంగ్రెస్

September 19, 2022

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ముగించిన తర్వాత నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ శరత్ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ ను అభివన అంబేద్కర్ అంటూ పొగడ్తలతో ముచెత్తారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను చూడలేదన్నారు. కానీ కేసీఆర్ రూపంలో అంబేద్కర్ ను చూస్తున్నామన్నారు. అంబేద్కర్ స్పూర్తితో కేసీఆర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సంతోషంగా ఉందని కలెక్టర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఆదర్శంగా ఉందన్నారు. భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలెక్టర్ శరత్.. అభినవ అంబేడ్కర్ అంటూ కీర్తించడంపై తీవ్రంగా మండిపడ్డారు. బాబాసాహెబ్ను సీఎంలో చూస్తున్నానని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా మాట్లాడటం అంబేడ్కర్ను అవమానించడమే అవుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెప్పినందుకే ఇలా పొగిడారా అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని, చెయ్యకపోతే తల నరుక్కుంటానని హామీ ఇచ్చి మోసం చేసినందుకు కేసీఆర్ అభినవ్ అంబేద్కర్ అయ్యారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన గిరిజన రిజర్వేషన్లు 8 ఏళ్లుగా ఇవ్వకుండా ఆపి గిరిజనులకు తీవ్ర నష్టం చేసిన కేసీఆర్ ఏ విధంగా అభినవ అంబేడ్కర్ అవుతారని ప్రశ్నించారు.