malwa Govt hospital announces cash prize for TB patients
mictv telugu

ఆ రోగులను తీసుకురండి.. 50 వేలు గెలవండి : ప్రభుత్వాసుపత్రి బంపర్ ఆఫర్

October 19, 2022

malwa Govt hospital announces cash prize for TB patients

దసరా, దీపావళి వంటి పండుగల సందర్భంగా షాపింగ్ మాల్స్, బట్టల దుకాణాలు, నగల దుకాణాలు పలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇలా ప్రజలను ఆకర్షించి సరుకు అమ్ముకొని లాభాలు గడిస్తాయి. కానీ, ఓ ఆసుపత్రి అలాంటి ఆఫర్ ప్రకటించడం ఎప్పుడైనా విన్నారా? అదీ ప్రభుత్వాసుపత్రి ఇచ్చిందంటే నమ్మగలమా? మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాసుపత్రి ఈ ఆఫర్ ప్రకటించింది.

అంతేకాక, ఖచ్చితమైన బహుమతి తులం బంగారం లేదా రూ. 50 వేలు గెలుచుకోండని ప్రకటన ఇచ్చింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ఆఫర్ గురించి ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆసుపత్రి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే.. క్షయ వ్యాధి (టీబీ) రోగులను ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకురావాలంట. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అక్కడి ఆరోగ్య శాఖ ఈ ఆఫర్ ఇచ్చింది. ప్రజల్లో వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్క రోగిని తీసుకొస్తే రూ. 500తో పాటు ఫ్రీగా టిఫిన్ చేయవచ్చు. ఇలా వంద మందిని తీసుకొస్తే రూ.50 వేల నగదు లేదా తులం బంగారం ఇస్తారు. అంటే రోగుల సంఖ్యను బట్టి బహుమతి ఉంటుందన్నమాట. ఇలాంటి ఆఫర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే బాటుంటుంది కదూ.