హలో ‘ మామ్ ’ మంచి మెసేజ్ ఇచ్చారు ! - MicTv.in - Telugu News
mictv telugu

హలో ‘ మామ్ ’ మంచి మెసేజ్ ఇచ్చారు !

July 8, 2017

సీనియర్ పాత్రికేయులు భరధ్వాజ రంగవజ్ఝల  ‘ మామ్ ’ సినిమా మీద రాసిన విశ్లేషణ యధాతథంగా మీకోసం…ఇందాకే శ్రీదేవి నటించిన ‘ మామ్ ’ సినిమా చూశాను. అంతకు ముందు హీరో వెంకటేశ్ నటించిన ‘ దృశ్యం ’ చూశాను. చూడలేదుగానీ … ‘ సర్పయాగం ’ అనే సినిమా గురించీ విన్నాను. ఇంకా ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలూ చూశాను. చాలా కాలం క్రితం అక్కినేని నాగేశ్పర్రావు నటించిన ‘ సుడిగుండాలు ’ కూడా చూశాను. చాలా సినిమాలు ఇదే తరహా కథతో వచ్చాయి కదా అని మామ్ ని కాదనడం లేదు.

సరిగ్గా స్కూళ్లల్లో డ్రగ్స్ సరఫరా … అసలు కొరియర్ సర్వీసు ద్వారా గుమ్మంలోకే డ్రగ్స్ విక్రయం జరుగుతోందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మామ్ సినిమా చూడడం ఓ రకంగా భయం కలిగించింది… ఇలాంటి కథలతో సినిమాలు ఎప్పుడొచ్చినా, ఎన్ని వచ్చినా … సమస్య ఎప్పటికప్పుడు కొత్తగా మన ముందు నిలబడుతూ ఉండడం వల్లే వాటిని ఏదో మేరకు యాక్సెప్టు చేస్తున్నాం. నిన్నే నేనో దారుణం చేశాను. ప్రైవేటు స్కూళ్లల్లో డ్రగ్స్ విషయంలో ఓ పోస్టు పెట్టి virinchi laxmi గారి ఆగ్రహానికి గురయ్యాను. ఆవిడ అన్నారు ‘ ఇది బాధపడాల్సిన సందర్భం … చాలా మంది వ్యంగ్యంగా స్పందిస్తున్నారు ’ అని. ఆవిడ స్పందన రాత్రి చదివినప్పుడు ఏం అనిపించలేదుగానీ … పడుకున్న తర్వాత చాలా సేపు అలా బుర్రలో తిరుగుతూనే ఉంది. దీంతో పొద్దున్నే లేవగానే ముందు నా పోస్టు డిలిట్ చేసేశాను. అప్పుడు ప్రశాంతంగా అనిపించింది.

మామ్ సినిమాలో సవతి తల్లి కాన్ ఫ్లిక్ట్ నడుస్తుంది తప్ప మిగిలిన సినిమా అంతా మనకు తెలిసిన కథే. స్కూళ్లు కాలేజీలు …, ఇలా ఎందుకు అయిపోతున్నాయి. ఆర్ధిక సరళీకరణ విష ప్రభావాలే ఇవన్నీ … మిగిలిన విషయాలు ఎన్ని మాట్లాడుకున్నా వృధానే. స్కూళ్లల్లో చేర్పించడం తో మన పని అయిపోతోంది. ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులిద్దరూ ఒళ్లు హూనం చేసుకుంటుంటారు. పిల్లలను పట్టించుకునేంత వెసులుబాటు ఉండడం లేదు.

ఈ లోగా పిల్లలకు అందుబాటులో ఫోన్లు, ల్యాబ్ టాప్లు, ఇంటర్నెట్టు వెసులుబాటులోకి వచ్చేయడం … సుడిగుండాలు టైమ్ లో పెంపకానికి సంబంధించిన అంశమే ప్రధానం. దీంతో పాటు సాహిత్యం యువతరం మీద వేస్తున్న దుష్ప్రభావం మీద కూడా కొంత చర్చ సాగుతుంది.పిల్లల మీద చదువు ఒత్తిడి, కెరీర్ ఒత్తిడి పెరిగిపోతోంది. పోటీ తీవ్రంగా ఉంటోంది. దీంతో పాటు డైవర్షన్ స్కీములు అధికమైపోయాయి. సినిమా ఒక్కటే డైవర్షను ఒకప్పుడు … ఇప్పుడలా కాదు … మనిషి మన కళ్లముందే ఉన్నా డైవర్ట్ అయిపోతున్నాడు. ఆ దిశగా నెట్టు మనల్ని నెట్టుకెళ్లిపోతోంది.అప్పుట్లో బ్రతుకు భయం అనేది ఇప్పటిలా పీక్స్ లో లేదు. చదివితే ఉద్యోగం చేసుకుంటాడు. లేకపోతే కొట్లో కూచుంటాడు లేదూ వ్యవసాయం చేస్తాడు … లేదో మనం చేసేదే చేసుకు బ్రతికేస్తాడు అని తల్లిదండ్రులు అనుకునేవారు. సాంప్రదాయ వ్యాపారాలు వ్యాపకాలు అన్నీ సరళీకరణ నేపధ్యంలో నాశనం అయ్యాయి. దీంతో బ్రతుకు భయం పెరిగిపోయి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద బాగా వత్తిడి పెట్టేస్తున్నారు.

పైగా లీజర్ లిటరేచర్ వైపు కూడా పిల్లలు పెద్దగా చూడ్డం లేదు. పూర్తిగా నెట్టే … ఫోన్లోనే అధికంగా ఉంటున్నారు. దీన్లో పాజిటివ్ అంశం కూడా ఉంది. కానీ నెగెటివ్ అంశం కాస్త అధికంగానే ఉంటోంది. ఒకప్పుడు … విద్యాసంస్దల్లో రాజకీయాలు ఉండడం డైవర్షన్ అనుకునేవారు. కానీ అదీ తప్పే. అదో చైతన్యం ఉండేది విద్యార్ధుల్లో … కాస్త సోషల్ అవేర్ నెస్ ఉండేది. ఇప్పటి కార్పోరేట్ విద్యార్ధుల్లో ఆ చైతన్యం అస్సలు కనిపించదు … పరమ కెరీరిజం … వాడేసుకోవడం … ఏది పడితే అది … ఎంతటి దారుణం అయినా చేసేయడం … లైటు తీసుకోవడం ఈ ధోరణలు కాస్త అధికంగానే పోగుపడుతున్నాయి పిల్లల్లో … ఈ ధోరణుల్లో బాగంగానే ఇళ్లల్లో తల్లిదండ్రుల మీద కూడా చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. పిల్లల పెంపకం గతంలో అంత వీజీ కాదిప్పుడు … పార్టీకి వెళ్లడం మీద డైనింగ్ టేబుల్ దగ్గర చర్చ జరిగిన సందర్భంగా మామ్ మూవీలో శ్రీదేవి కూతురు రియాక్ట్ అయిన సీను చూసినప్పుడు నాకు ఏడుపొచ్చేసింది.

చుట్టూ ఉన్న వాతావరణం పిల్లల మీద వేస్తున్న ప్రభావం సాధారణమైనది కాదు. సిగరెట్టు తాగడం అనేది అప్పట్లో చాలా గొప్ప విషయం … ఇప్పుడు మందు తాగడం కూడా పెద్ద విషయం కాదు. ట్రీట్లు … పబ్బులు … పరిస్థితి దారుణంగానే ఉంది. యాక్సెప్టు చేయకతప్పని పరిస్థితి తల్లిదండ్రులది … పేరు అనవసరంగానీ … బెజవాడలో నేను రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న రోజుల్లో చాలా సందర్భాల్లో అరస్టు చేసి చావగొట్టిన ఓ పోలీసాఫీసరు … రీసెంటుగా హైద్రాబాదులో తగిలాడు. ఆయన రిటైర్ అయిపోయాడట పాపం. కానీ నన్ను గుర్తుంచుకోవడం … గుర్తు పట్టడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ఆ సందర్భంగా ఓ హోటల్ కు తీసుకెళ్లి చాలా సేపు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన అంశం కూడా పిల్లలే. అప్పట్లో మీరు కాలేజీలో చదువుకునే రోజుల్లో మిమ్మల్ని బాగా టార్చర్ పెట్టామయ్యా … కానీ ఇప్పడు ఆలోచిస్తుంటే … మీరున్నప్పుడే అదే మీ రాజకీయాలు ఉన్నప్పుడే కాలేజీలు బావున్నాయి. ఇప్పుడు సర్వనాశనం అయిపోయాయి. అప్పట్లో మిమ్మల్ని చావగొట్టినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను అన్నాడాయన. ఆయనే మరో విషయం కూడా నాతో పంచుకున్నాడు … ఒక మనిషి ఫోను ఓ పావుగంట మనకు దొరికితే చాలండీ … వాడేంటో చెప్పేయొచ్చు అన్నాడు.

కాలేజీ పిల్లల అంశాలతో మొదలెట్టి బ్రేకప్పుల దాకా మాట్లాడాడాయన. తన మనవరాళ్ల గురించి కూడా ఆందోళన నాతో పంచుకున్నాడు పాపం. ఒకటికి పదిసార్లు ఆయనన్న మాటేంటంటే … అప్పట్లో మీరున్నప్పుడే కాలేజీలు బావున్నాయి పిల్లలూ బావుండేవాళ్లు … అని పదే పదే అన్నాడాయన. ఆయనతోనూ నేను ఇదే చెప్పాను. మమ్మల్ని మీరు చావగొట్టి పంపేశామనడం కరస్టు కాదండీ … ఇదంతా కాలమహిమే. ఆర్ధిక సరళీకరణ నేపధ్యంలో జరిగిన మార్పుల్లో భాగంగానే ఈ పరిస్థితి దాపురించింది అన్నాను. ఇవన్నీ … మామ్ సినిమా చూస్తున్నంత సేపూ మనసులో సుళ్లు తిరిగాయి. పిల్లల్లో సంస్కారాన్ని ఎలా బ్రతికించుకోవాలి అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. చదువు పాడూ అన్నీ తర్వాత, అందుకోసం ఏం చేయాలనేది ఆలోచించడం ఇప్పుడు అత్యావశ్యకం.