Mamata Banerjee announced huge discounts for Dussehra celebrations
mictv telugu

దసరా ఉత్సవాలకు దీదీ భారీ నజరానాలు.. ఒక్కొక్కరికి 60 వేలు

August 23, 2022

దసరా ఉత్సవాలు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ఉత్సవాలకు పేరెన్నికగన్న పశ్చిమ బెంగాల్‌లో సందడి మొదలైంది. ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఉత్సవ కమిటీలకు నిధులు, మండపాలకు విద్యుత్, ఉద్యోగులకు సెలవులు వంటి అంశాలు చర్చించారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈ భేటీ జరుగగా, ఉత్సవాలను భారీ ఎత్తున జరిపేందుకు నిర్ణయించారు. దీనితో పాటు 2021 డిసెంబరులో ఉత్సవాలకు యునెస్కో గుర్తింపు లభించడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో దుర్గా ఉత్సవ నిర్వహణ కమిటీలకు ప్రభుత్వం భారీ ఎత్తున నజరానాలు ప్రకటించింది. అవి..ప్రతీ ఉత్సవ నిర్వహణ కమిటీకి ప్రభుత్వం తరపున రూ. 60,000 అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు పండుగ నిమిత్తం 11 రోజుల సెలవులు మంజూరు చేశారు. మండపాలకు అనుమతి కోసం అగ్నిమాపక శాఖకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. దుర్గా పూజ ప్రకటనలపై కూడా ఎలాంటి పన్ను ఉండదని, పూజా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. వీటితో పాటు మొత్తం 40,092 ఉత్సవ కమిటీలకు విద్యుత్ వినియోగంలో 60 శాతం రాయితీని కూడా ప్రకటించింది. కాగా, ఈ రాయితీల మొత్తం రూ. 240 కోట్లకు పైగా ఉంటుంది. ‘ఖజానా ఖాళీగా ఉన్న సమయంలో దుర్గా మాత నింపుతుందని ఆశిస్తున్నాను’ అంటూ సీఎం అన్నారు. ఇవి కాక, దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు లభించడంతో ‘టూ థ్యాంక్స్ యునెస్కో’ పేరుతో సెప్టెంబరు 1న బెంగాల్ మొత్తం ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆరోజు ఉద్యోగులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు, విద్యార్దులు 11 గంటల వరకే పని చేసి తర్వాత కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఇందులో పదివేల మంది పాల్గొనేలా చూడాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది.