పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టే క్రమంలో ఈ భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి హాజరుకావాంటూ ఆమె 22 పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. అయితే ఈ సమావేశం జరుగకముందే దీదీకి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి.
సమావేశానికి తాము రావటం లేదంటూ సీపీఎం తేల్చి చెప్పింది. మీటింగ్ ఎజెండా ఏంటో తెలియకుండా రాలేమని స్పష్టం చేసింది. మరోవైపు దీదీ స్వయంగా ఫోన్ చేసి పిలిచిన సీఎం కేసీఆర్ కూడా భేటీకి వెళ్లడం లేదు. తన బదులు ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మంగళవారం దీదీ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి రేసులో లేనని పవార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాంతో పవార్ కాకుండా మరో అభ్యర్ధిని ఉమ్మడిగా బరిలోకి దింపాలని దీదీ యోచిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా ఎన్డీయేతర పార్టీల మద్ధతు కూడగట్టుకోవడంలో భాగంగానే మీటింగ్ నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేస్తున్నారు.