మమతా బెనర్జీ సమావేశానికి..కేసీఆర్ దూరం - MicTv.in - Telugu News
mictv telugu

మమతా బెనర్జీ సమావేశానికి..కేసీఆర్ దూరం

June 15, 2022

దేశ రాజధాని ఢిల్లీలో నేడు ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ దూరం అయ్యారు. అంతేకాదు, మమతా బెనర్జీ సమావేశానికి కేసీఆర్‌తోపాటు, టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు కూడా సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రగతి భవన్‌లో ముఖ్య నేతలతో కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. బుధవారం ఢిల్లీలో విపక్షాల భేటీకి హాజరు కావాలా, వద్దా అనే అంశంపై విస్తృతంగా చర్చించారు. చివరకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం.. కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించిన సందర్భంగా, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కవడం, మమత సమావేశం నిర్వహిస్తున్న తీరే సరిగా లేకపోవడం వంటి కారణాలతో కేసీఆర్ సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరోపక్క సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు, 8 మంది సీఎంలు, 22 మంది వివిధ పార్టీల నేతలకు మమత లేఖలు రాశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తే తాము వచ్చేది లేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవలే తేల్చి చెప్పారు. చెప్పినట్లుగానే సమావేశానికి డుమ్మా కొట్టారు.