టీచర్ల నియామక ప్రక్రియలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలను ఎదుర్కొంటున్న పార్థా ఛటర్జీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ను అరెస్ట్ చేసిన 5 రోజుల తర్వాత మమత ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్థా చటర్జీ సహాయకురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన రెండో ఫ్లాట్లో ఈడీ జరిపిన సోదాల్లో రూ.29 కోట్ల నగదు, ఐదు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే ఛటర్జీపై దీదీ వేటు వేశారు.
పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను జూలై 23న కోల్కతాలో అరెస్ట్ చేసిన ఈడీ.. అర్పిత ఇంట్లో రూ.21 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. కోల్కతాలోని బెల్ఘారియా ప్రాంతంలో అర్పితకు చెందిన రెండో నివాసంలో గురువారం ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది. పది ట్రంకు పెట్టెల్లో నగదును ఈడీ అధికారులు ఆమె ఇంటి నుంచి తీసుకెళ్లడం గమనార్హం.
మొత్తంగా రూ.50 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు లభ్యం కావడంతో ఈ టీఎంసీ నేతపై సొంతపార్టీ నుంచే వ్యతిరేకత రావడం మొదలైంది. తక్షణమే ఆయన్ను మంత్రి పదవుల నుంచి తొలగించి, పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో గురువారం మమతా బెనర్జీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే మంత్రిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.