జగన్‌కు మమతా బెనర్జీ ఆహ్వానం..లేఖ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌కు మమతా బెనర్జీ ఆహ్వానం..లేఖ వైరల్

June 16, 2022

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖ హాట్ టాఫిక్‌గా మారింది. ఢిల్లీలో బుధవారం జరగబోయే సమావేశానికి జగన్ కూడా పాల్గొనాలని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. కానీ, ఆ లేఖ జగన్‌కు అందిందా? లేదా? ఆయన ఎందుకు సమావేశానికి హాజరు కాలేదు? అనే విషయాలపై ప్రతిపక్షాలు తెగ చర్చించుకుంటున్నాయి.

ఆ లేఖలో.. “మన దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన, సమర్ధవంతమైన ప్రతిపక్షం అవసరం. ఈరోజు దేశాన్ని పట్టిపీడిస్తున్న విభజన శక్తులను అడ్డుకోవడానికి అన్ని ప్రగతిశీల పార్టీలూ కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య సంరక్షకుడైన దేశాధినేతను ఎన్నుకొనే అధికారాన్ని ఈ ఎన్నిక చట్టసభల ప్రతినిధులకు ఇచ్చినందున ఇదో మహత్తరమైన అవకాశం. ప్రతిపక్షాలన్నీ గొంతు కలపాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఈ నెల 15న ఢిల్లీలో జరిగే సమావేశానికి మీరు రావాలి.” అని ఆమె పేర్కొన్నారు. అయితే, బుధవారం సమావేశం ముగిసన తర్వాత ఈ లేఖ వెలుగులోకి రావడంతో తెగ వైరల్ అవుతోంది.

ముందుగా తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. 22 పార్టీల నేతల పేర్లలో జగన్ మోహన్ రెడ్డి పేరు కనిపించలేదు. దాంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను సమావేశానికి ఆహ్వానించలేదేమోనని అనుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆహ్వాన లేఖ ప్రత్యక్షం కావడంతో పలు చర్చలు మొదలైయ్యాయి. బుధ‌వారం ఢిల్లీలో మమతా బెనర్జీ భేటీ ముగిశాక ఈ లేఖను ప్ర‌ముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ బ‌య‌ట‌పెట్టింది.

మరోపక్క వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి బుధ‌వారం వ‌ర‌కూ ఈ భేటీకి సంబంధించి, త‌మ‌కు మమతా బెనర్జీ నుంచి ఎటువంటి లేఖ గాని, పిలుపుగాని అంద‌లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. భేటీ ముగిశాక ఈ లేఖ బ‌య‌ట‌కు రావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇలా ఎందుకు జరిగింది? అనే విషయాలపై తృణమూల్ కాంగ్రెస్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.