రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను, రక్తం ధారపోసైనా.. మమత
బెంగాల్‌ను విభజించాలంటూ బీజేపీ చేస్తున్న విభజన రాజకీయాలు నా ప్రాణం ఉన్నంతవరకు చెల్లవని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఆమె బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు. ‘ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను చేస్తోంది. నార్త్ బెంగాల్, ప్రత్యేక కాంతాపూర్ అంటూ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తోంది. గతంలో గూర్ఖాలాండ్ అంటూ ప్రచారం చేసి విఫలమయ్యారు. ఇప్పుడు మరోసారి అలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. నా ప్రాణం ఉన్నంతవరకు బెంగాల్ విభజనను అడ్డుకుంటాను. నా రక్తం చిందించడానికి కూడా వెనుకాడను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రత్యేక కాంతాపూర్ కోసం డిమాండ్ చేస్తున్న జీవన్ సంగ్లా మమతాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రత్యేక కాంతాపూర్‌ను మమతా అడ్డుకోవాలని చూస్తే అమె రక్తం కళ్లజూస్తామని’ బెదిరించారు. తాజాగా మమత ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ అలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తనను బెదిరించాలనుకునే వారి ఆటలు సాగనివ్వనని స్పష్టం చేశారు.