350 మందికి మస్కా.. ఆచ్చం ఆడపిల్లలా.. - MicTv.in - Telugu News
mictv telugu

350 మందికి మస్కా.. ఆచ్చం ఆడపిల్లలా..

February 25, 2020

Tamil Nadu

ఓ మిమిక్రీ కళాకారుడు నమ్ముకున్న కళకు కళంకం తీసుకువచ్చే పనిచేశాడు. తనకున్న కళతో నలుగురిని నవ్వించాల్సింది పోయి మోసం చేయాలని భావించాడు. అమ్మాయిల్లా గొంతులు మార్చి ఏకంగా 350 మందితో సరస సల్లాపాలు ఆడి వాళ్లను పచ్చిగా మోసం చేశాడు. అందినకాడికి దండుకున్నాడు.. ఆపై అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి జిల్లా పణుకుడికి చెందిన వళ్లల్ రాజ్‌కుమార్ మిమిక్రీ కళలో ఆరితేరాడు. గొంతులు మార్చి మాట్లాడటం అతని ప్రత్యేకత. అప్పటికప్పుడు పరిచయం అయిన వ్యక్తి గొంతులను కూడా ఇట్టే పట్టేయగల సమర్థుడు. 

ఇంకేం తన వద్ద కళ ఉంది దానితో వ్యాపారం చేసుకుందాం అని దుర్బుద్ధి పుట్టింది అతనికి.  అమ్మాయిలలా గొంతుమార్చి అబ్బాయిలకు ఫోన్ చేసి వలపు వల విసిరేవాడు. బావా.. బంగారు.. ఛీపో.. మిస్ట్డ కాల్ వచ్చిందని చెప్పి పెట్టేసేవాడు. అమ్మాయి ఇంత సెక్సీగా మాట్లాడుతోందని వారు కాల్ బ్యాక్ చేయడం.. ఆ తర్వాత వారిని మాటలతో మభ్యపెట్టి  ట్రాప్‌లో పడేయటం.. ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఆ కారణం ఈ కారణం చెప్పి వాళ్ల వద్ద డబ్బులు గుంజేవాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 350 మందిని మోసం చేశాడు. ఆ తర్వాత పత్తాలేకుండా పోయేవాడు. అంతా అయిపోయాక వారు మోసపోయామని తెలుసుకుని బాధపడేవారు. కొందరు ధైర్యం చేసి పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతన్ని పట్టుకున్నారు. అతని పేరు రాజ్ కుమార్ అని తెలిపారు. తమకు మైలాపూర్, కీల్ పాక్కం ప్రాంతాల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు అందినట్టు పోలీసులు వెల్లడించారు.