వీడికి ప్రేమంటే.. వెంటాడి పొడిచి చంపడం.. - MicTv.in - Telugu News
mictv telugu

వీడికి ప్రేమంటే.. వెంటాడి పొడిచి చంపడం..

October 6, 2018

ప్రేమోన్మోదానికి మరో యువతి నెత్తురోడింది.  ప్రాణపాయ‌స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఆమెను వెంటపడి విచక్షణరహితంగా కత్తితో దాడిచేశాడు. స్థానికులు అప్రమత్తమై అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది.

ttt

జయవిహార్ సెంటర్‌లో ఉన్న ఓ వస్త్రదుకాణంలో గాయత్రి అనే యువతి పనిచేస్తోంది. అదే దుకాణంలో దిలీప్ అనే యువకుడు కూడా పనిచేస్తున్నాడు. గాయత్రిని అతడు కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కానీ, ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో దిలీప్ ఆమెపై కోపం పెంచుకున్నాడు.

ప్రేమ విషయమై దిలీప్ శనివారం గాయత్రిని మరోసారి నిలదీశాడు. ప్రేమిస్తావా చస్తావా అంటూ ఆమెను అడ్డుకున్నాడు. ఎప్పటిలాగే ఆమె తిరస్కరించడంతో వెంటతెచ్చుకున్న కత్తితో ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. దీంతో స్థానికులు అతణ్ణి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించి, గాయాలపాలైన గాయత్రిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా సదరు యువతి సంవత్సర కాలంగా తనను ప్రేమిస్తోందని, కొద్ది రోజులుగా మరో యువకుడితో చనువుగా ఉంటోందని దిలీప్ ఆరోపిస్తున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడంలేదని అతడు పోలీసులకు పేర్కొన్నాడు. ప్రేమ పేరుతో తనను మోసం చేసినందుకే ఇలా చంపాలనుకున్నానని  పోలీసుల ముందు అంగీకరించాడు.