Man Begging By Bringing A Dog Instead Of ox In Nizamabad
mictv telugu

గంగిరెద్దు కాదు, గంగికుక్క.. ఎద్దులేదని కుక్కతో వచ్చిన హరిదాసు..

August 10, 2022

సాధారణంగా సంక్రాంతి, దసరా పండుగ సమయాల్లో గ్రామాల్లోని ఇళ్లముందు గంగిరెద్దులు సందడి చేస్తాయి. ప్రస్తుతం పట్టణాల్లో కూడా మామూలు సమయాల్లోనూ గంగిరెద్దులు కనిపిస్తున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా చాలామంది గంగిరెద్దులతో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తున్నారు. అయితే ఎద్దులున్న వారు వాటిని గంగిరెద్దుగా అలంకరించి తిప్పుతారు… కానీ గంగిరెద్దు లేనప్పుడు ఏం చేయాలి.. ఇదే ఆలోచన వచ్చింది ఓ వ్యక్తికి.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లో సన్నాయి చప్పుడుకు బయటకు వచ్చిన ఓ ఇల్లాలు అవాక్కయింది. భిక్షాటన కోసం వచ్చిన ఓ వ్యక్తి గంగిరెద్దు స్థానంలో కుక్కను తీసుకొచ్చాడు. ఇదేంటని ఆమె అడిగితే గంగిరెద్దులు దొరకడం లేదని.. మామూలుగా వెళ్లి భిక్షం వేయమని అడిగితే ఎవరూ వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గంగిరెద్దు స్థానంలో ఇలా కుక్కను తీసుకొచ్చి భిక్షాటన చేసుకుంటున్నానని చెప్పాడు. అతడి పరిస్థితిని అర్ధం చేసుకున్న ఆ ఇల్లాలు తనకు తోచినంత సాయం చేసి అతడిని పంపించింది. మొత్తానికి కుక్కతో కూడా భిక్షాటన చేయొచ్చని అతడి ఆలోచన చూసి మిగతా వారు కూడా అలానే చేస్తా ఈసారి సంక్రాంతికి గంగిరెద్దులకు బదులు కుక్కలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.