ఆడబిడ్డ పుట్టిందని తలాక్.. హైదరాబాద్‌లో దారుణం - MicTv.in - Telugu News
mictv telugu

ఆడబిడ్డ పుట్టిందని తలాక్.. హైదరాబాద్‌లో దారుణం

November 19, 2019

కాదేదీ తలాక్ చెప్పడానికి అనర్హం అన్నట్లు తయారయ్యారు కొందరు భర్తలు. ఎత్తు పళ్లు ఉన్నాయని, అన్నం వండలేదని, సినిమాలు చూస్తోందని నానా సాకులతో భార్యలను వదిలించుకుంటున్నారు. చివరకు ఆడపిల్లను కనడం కూడా తప్పవుతోంది. తన భార్య మగబిడ్డను కనకుండా ఆడబిడ్డను కనిందని  త్రిపుల్ తలాక్ చెప్పి చేతులు దులుపుకుని వెళ్లిపోయాడు ఓ హైదరాబాదీ 

Hyderabad

పాతబస్తీకి చెందిన దస్తగిరి అనే యువకుడికి 2011లో మిరాజ్ బేగం అనే మహిళతో వివాహమైంది.  ఆ ప్రబుద్ధుడు అడిగిన లాంఛనాలన్నీ ఇచ్చి పెళ్లి చేశారు మిరాజ్ తల్లిదండ్రులు. పెళ్లి అయిన ఏడాదికే ఆమె తల్లి అయింది. పురిటినొప్పులు వచ్చిన సమయంలో భర్త, అత్తమామలు ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంచడంతో బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఆడబిడ్డ కావడంతోనే దస్తగిరి ఆ విధంగా చేశాడని ఆరోపణలు వచ్చాయి. అతనికి మగబిడ్డే కావాలనే వెర్రి దాహం చల్లారలేదు.
మిరాజ్ మరోసాగి గర్భం దాల్చి కొద్ది నెలల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన దస్తగిరి.. ఆడబిడ్డ తనకు వద్దని భార్యను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై పెద్దలు పంచాయితీ పెట్టి ఎన్నిసార్లు సముదాయించినా అతని తీరు మారలేదు. భర్త మనసు మార్చుకోవాలనే ప్రయత్నంలో మిరాజ్ భరోసా సెంటర్‌ను ఆశ్రయించడంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మూడుసార్లు కౌన్సిలింగ్ తర్వాత కూడా దస్తగిరిలో ఎలాంటి మార్పు రాలేదు. భార్యభర్తలను కలిపేందుకు పెద్దలు మరోసారి నిర్వహించిన పంచాయతీలోనే దస్తగిరి భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లిపోయాడు.

తాను కోరినట్లుగా మగబిడ్డను కని ఇవ్వనందుకే భార్యకు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నట్లు చెప్పాడు. దీంతో షాక్ తిన్న మిరాజ్ బేగం వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు.