Man carrying mother’s body on shoulder in Bengal’s Jalpaiguri shocks people
mictv telugu

తల్లి శవాన్ని దుప్పట్లో చుట్టి భుజాలపై మోసుకెళ్తూ..

January 6, 2023

అభివృద్దిలో దూసుకుపోతున్నామని చెబుతున్న దేశంలో..మృతదేహాలను తరలించేందుకు డబ్బులు లేని మనుషులు ఉండడం కలవరపెడుతోంది. పుట్టెడు దు:ఖంతో కుటుంబ సభ్యుల మృతదేహాలను కిలోమీటర్ల మేర మోస్తూ కాలినడక నివాసానికి తీసుకెళ్తున్న దృశ్యాలు ఈ మధ్య కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. కన్నతల్లి శవాన్ని భుజంపై మోసుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన హృదయ విదారక ఘటన పశ్చిమబెంగాల్‌‎లో చోటుచేసుకుంది.

దేశంలో రోజురోజుకు అంబులెన్స మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. కాసుల కోసం కష్టాల్లో ఉన్నవారని పీక్కుతింటన్నారు. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీరిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవంతో ఆడింది ఆట..పాడింది పాటగా సాగుతుంది. ఇప్పుడు కూడా తల్లి పోయి తీవ్ర బాధలో ఉన్న రామ్‌ప్రసాద్ దేవన్ డబ్బులు కోసం అంబులెన్స్ డ్రైవర్లు వేధించారు.

పూర్తి వివరాలు పరిశీలిస్తే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 72 ఏళ్ల తల్లిని జల్‌పాయ్‌గురిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రామ్‌ప్రసాద్ దేవన్.. తీసుకు వెళ్లాడు. పరిస్థితి విషమించి ఆ మరుసటి రోజే ఆమె కన్నుమూసింది.అయితే ఆమెను ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లను సంప్రదించగా రూ.3000 అడిగారు. అంత సొమ్ము తాము ఇచ్చే స్తోమత లేకపోవడంతో 40 కిలోమీటర్లు దూరం ఉన్న ఇంటికి నడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద సోదరుడి తీసుకొని శవంతో నడక ప్రారంభించారు. ఇంతలో ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అతనికి ఒక వాహనం ఏర్పాటు చేసింది. ఉచితంగా వారిని ఇంటివరకూ తీసుకువెళ్లింది. ఉచిత సేవలు అందించేందుకు మందుకు వచ్చిన వారిని అంబెలెన్స్ ఆపరేటర్లు ఆసుపత్రి సమీపానికి కూడా రానీయడం లేదని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ జాతీయ సమాచార, సాంకేతిక శాఖ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసూ ఇది మమతా బెనర్జీ తరహా పాలనకు నిదర్శనమని రాసుకొచ్చారు.