తనకున్న వ్యసనాన్ని ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి వదిలేద్దామనుకున్నాడు ఆ యువకుడు. ఇప్పటికే ఆలస్యం చేసినట్లు భావించి వెంటనే బైక్‌పై గుడికి బయల్దేరాడు. మార్గమధ్యంలో పోలీసు డ్రెస్‌లో ఓ వ్యక్తి లిఫ్ట్ అడగ్గా.. సరేనంటూ ఎక్కించుకొని గుడివద్దకు చేరుకున్నాడు. గుడిలో ప్రమాణం చేసి.. బయటకు వచ్చేసరికి ఆ వ్యక్తి, బైక్, మొబైల్ ఫోన్ కనిపించక పోయేసరికి మొదట కంగారుపడ్డాడు. ఆ తర్వాత తాను బైక్‌పై ఎక్కించుకుంది పోలీస్ అవతారంలో ఉన్న దొంగ అని గ్రహించి.. అసలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఈ ఘరానా మోసం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు టౌన్ దుర్గానగర్ కు చెందిన కార్తీక్‌కు మద్యం అలవాటు ఉంది. ఆ అలవాటును మానేయాలని, చంద్రగిరి శ్రీమూలస్థానమ్మ ఆలయంలో కంకణం కట్టుకోవాలని చిత్తూరు నుంచి బైక్‌పై బయల్దేరాడు. కాశిపెంట్ల దగ్గరకు రాగానే.. ఓ వ్యక్తి పోలీస్ డ్రస్‌లో లిప్ట్ అడిగాడు. అతడు పోలీస్ అని భావించిన కార్తీక్ లిప్ట్ ఇచ్చాడు. బైక్‌పై వస్తున్నప్పుడు కార్తీక్‌తో ఆ నకిలీ పోలీస్ చనువుగా మాట్లాడాడు. ఎలాగూ మానేస్తున్నావని, చివరిసారిగా తాగుదామని చెప్పి తండవాడ వైన్ షాప్ కు తీసుకెళ్లాడు. తన డబ్బులతోనే ఆ నకిలీ కి ఒరిజినల్ వైన్ ఇప్పించాడు కార్తీక్. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి మూలస్థానమ్మ ఆలయానికి వచ్చారు. కంకణం కట్టుకునేందుకు స్నానం చేసి ఆలయంలోకి వెళ్లాడు.
ఇదే అదనుగా భావించి నకీలీ పోలీస్ మొబైల్, బైకు తీసుకొని పారిపోయాడు. కంకణం కట్టుకుని బయట వచ్చిన కార్తీక్.. తన బైక్ కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. ఇదంతా ఆ పోలీస్ పనిగా అనుమానించాడు. వెంటనే తాను మోసపోయినట్టు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలయంలో నిందితుడు కార్తీక్‌తో కలిసి తిరగడం, బైక్ తీసుకొని పారిపోవడం లాంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. నిందితుడ్ని గుర్తించే పనిలో పడ్డారు.