సినిమాల్లో అవకాశాల పేరుతో నయవంచన
ఒక్క ఛాన్స్ ఇది సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఎంతో మంది వాడే మాట. ఈ మాటే చాలా మందికి చేటు తెచ్చిపెడుతోంది. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నవారు లెక్కలేనంత మంది వెలుగులోకి వస్తూనే ఉన్నారు. తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులను మోసం చేస్తున్న ఓ వ్యక్తి గుట్టు రట్టు చేశారు పోలీసులు. మోసపోయిన ఓ యువతి ఫిర్యాదు చేయడంతో అతన్ని కటకటాల్లోకి పంపించారు.
బెంగుళూరుకు చెందిన వెంకటేష్ భావసా(22) అనే యువకుడు సినిమాల్లో అవకాశం కోసం వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెరలేపాడు.నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు తెరిచి యువతులను పరిచయం చేసుకునేవాడు. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి డబ్బులు తీసుకునే వాడు. ఇలా హీరోలు, నిర్మాతల పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి యువతులతో చాటింగ్ చేసేవాడు. ఇలాగే మోసపోయిన ఓ యువతి ఓ కన్నడ హీరోను కలిసి అతని పేరుతో ఓ వ్యక్తి నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి మోసాలకు పాల్పడుతున్నాడని చెప్పింది. వెంటనే వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడం బెంగుళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.