జూలోని పులులకు గొడ్డుమాంసం పెట్టొద్దు అని అస్సాంలో బీజేపీ నేత సత్య రంజన్ బోరా నాయకత్వంలో కొందరు బీజేపీ కార్యకర్తలు గౌహతిలోని స్టేట్ జూ వెలుపల నిరసన వ్యక్తంచేశారు. అప్పుడే గొడ్డు మాంసాన్ని తీసుకువస్తున్న వ్యాన్ను జూ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆ నిరసన కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు, జూ అధికారులు వారిని వ్యతిరేకించారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జ్ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. జూ అధికారులు, అస్సాం ప్రభుత్వం గొడ్డు మాంసం ఆపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బోరా హెచ్చరించారు. దీనిపై జూ అధికారులు స్పందిస్తూ ఆ అధికారం తమకు లేదని స్పష్టంచేశారు. జంతువులకు ఇవ్వవలసిన ఆహారంపై నిర్ణయం సెంట్రల్ జూ అథారిటీకి ఉంటుందని చెప్పారు. తమ డిమాండ్లను వారికి పంపాలని స్పష్టంచేశారు.
ఈ విషయమై అస్సాం రాష్ట్ర జంతు ప్రదర్శనశాల సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘జంతువుల అవసరాలు, ఆహారపు అలవాట్ల ప్రకారం మాంసం తినిపిస్తారు. వాటిపై అధ్యయనాలు నిర్వహించాకే నిర్ణయం తీసుకుంటారు. ఆందోళనకారుల డిమాండ్ ప్రకారం CZA జంతువుల ఆహారాన్ని మార్చినట్లైతే మాకేం అభ్యంతరం లేదు. పులులకు వారు ఏ మాంసం పెట్టమంటే మేము అదే పెడతాం’ అని తెలిపారు. మరోవైపు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పరిమల్ సుక్లాబైడియా ఈ విషయమై స్పందిస్తూ.. ‘గొడ్డు మాంసం, ఇతర రకాల మాంసాన్ని సాధారణంగా పులులు, సింహాలకు ఇస్తుంటారు. ఇతర అడవి జంతువులు వాటి పోషకాహార అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని అందిస్తారు. ప్రతి జంతువుకు భిన్నమైన ఆహారపు అలవాటు ఉంది. మేము దానిని చూసుకోవాలి. మేము దానిని భంగం కలిగిస్తే జూ అధికారులకు సమస్య అవుతంది. పైగా జంతువుల ఆరోగ్యంపై తీవ్ర పరిణామం పడొచ్చు’ అని వెల్లడించారు.