పెళ్లాం అనుమానానికి గూగుల్ మ్యాప్స్ ఆజ్యం..మొగుడు విలవిల
తమిళనాడులో ఓ భర్తకు వింత సమస్య వచ్చి పడింది. గూగుల్ మ్యాప్ అనే మొబైల్ అప్లికేషన్ తన కాపురంలో చిచ్చుపెడుతుందని మైలాదుతురాయ్‌కి చెందిన ఆర్. చంద్రశేఖరన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ అప్లికేషన్ ఓనర్ అయిన గూగుల్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
ప్రతి రోజు తాను ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక తన భార్య తన ఫోన్ తీసుకుని చెక్ చేస్తోందని… తాను ఆ రోజు ఎక్కడెక్కడికెళ్లిందీ తెలుసుకుంటుందని అతడు పోలీసులకు తెలిపాడు. అయితే, బుధవారం రోజున మాత్రం తాను వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లినట్టు గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తోందని చంద్రశేఖరన్ పోలీసుల వద్ద వాపోయాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదు తీసుకుని న్యాయం చేయాలనీ పోలీసులను వేడుకున్నాడు. అయితే పోలీసులు మాత్రం ఇంకా కేసు నమోదు చేసుకోలేదని తెలుస్తోంది. నిజానిజాలు తెలుసుకున్నాక కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపినట్టు సమాచారం.