Man defeated in MP panchayat polls booked for threatening people to return money he distributed
mictv telugu

ఎన్నికల్లో పంచిన డబ్బు తిరిగివ్వాలంటూ బెదిరింపు.. సర్పంచ్ అభ్యర్థి అరెస్ట్

July 13, 2022

ఇంటింటికి తిరుగుతూ డబ్బులివ్వాలని బెదిరిస్తూ, హింసిస్తున్న వ్యక్తిని చూస్తే ఎవరికైనా సహజంగా కోపమొస్తుంది, కొట్టాలనిపిస్తుంది. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన అలాంటి వ్యక్తి గురించే తెలిస్తే.. అతను అలా బెదిరించడంలో కొంచెం న్యాయం ఉందనే అనుమానం రాకమానదు. ఇంతకీ విషయమేంటంటే…రాజు దయమా అనే వ్యక్తి మానస తహసీల్‌లోని దేవరాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో అతను తాను ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి ఓట్ల కోసం ఎన్నికల ముందు పంచిన తన డబ్బులు తనకిచ్చేయమంటూ ప్రజలను బెదిరించడం మొదలు పెట్టాడు.

వారు ఇవ్వకపోయేసరికి.. ఇస్తారా? లేదా? అంటూ హింసించడం వంటి పనులు కూడా చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో విసిగిపోయిన గ్రామ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి తన వద్ద తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేయాల్సిందే.. అంటూ రాజు ప్రజల వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షలు వరకు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు రాజు, అతని సహచరుడి పై ఎన్నికల్లో డబ్బు పంచినందుకు, ప్రజలను డబ్బు ఇచ్చేయమంటూ.. ఇబ్బందిపెట్టినందుకుగానూ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.