స్నేహితుల మధ్య పందేలు కాయడం మామూలే. అయితే ఆ పందేలు వినోదాత్మకంగా ఉంటే సరదాగా ఉంటుంది. కానీ కొందరు ప్రాణాలు తీసే పందేలు ఆడతారు. ఇలాంటి పందేలు మొదట్లో ఉత్కంఠగా అనిపించినా.. తర్వాత ప్రాణాలు పోయే పరిస్థితులు తలెత్తుతాయి. మరికొందరు పంతానికి పోయి ప్రాణాంతక పందేలు కాస్తారు. అది ఆ క్షణంలో గొప్పగా అనిపించినా ప్రాణాలు పోయే ముందు కానీ తామెంత ప్రమాదకరమైన పని చేశామో అర్ధం కాదు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన 45 ఏళ్ల జై సింగ్ అతిగా మద్యం సేవించి మరణించాడు. స్నేహితులైన భోలా, కేశవ్‌లు జైసింగ్‌ని పది నిమిషాల్లో మూడు కోటర్ల చీప్ లిక్కర్ తాగగలవా? అని సవాల్ విసిరారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జైసింగ్.. నిర్ణీత సమయంలో తాగలేకపోతే స్నేహితులు తాగే మద్యానికి తానే బిల్ కడతానని ఒప్పుకొని పందేనికి అంగీకరించాడు. అనంతరం వెనుకా ముందు ఆలోచించకుండా గటగటా మూడు బాటిళ్ల చీప్ లిక్కర్‌ని గొంతు ద్వారా పొట్టలో పోసుకున్నాడు. క్షణాల పాటు బాగానే ఉన్నా కాసేపటికే మత్తు విపరీతంగా ఎక్కడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయి రోడ్డు పక్కన పడిపోయాడు. దీంతో హుటాహుటిన స్పందించి ఆస్పత్రికి తరలించినా ఏ ఆసుపత్రి కూడా చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. చివరికి ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఏడుపు లంకించుకున్నారు. తమకు నలుగురు మైనర్ పిల్లలు సంతానమని, ఇప్పుడు వారిని ఎలా పోషిస్తానని అతని భార్య దిగులు చెందుతోంది. అటు పందెం కాసిన స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.