Man dies of burn injuries after falling into pot of boiling porridge in Tamil Nadu's Madurai
mictv telugu

మద్యం మత్తులో మరిగే జావలో పడి.. చివరకు..

August 2, 2022

ఆ వీధిలో వరుసగా పొయ్యిలు పెట్టి అమ్మవారి నైవేద్యం కోసమని జావ కాస్తున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి పొయ్యి మీద ఉన్న జావ పాత్రలను గమనిస్తూ.. తూలుతూ అదుపు తప్పి సలసల మరిగే జావలో పడిపోయాడు. అక్కడే ఉన్నవాళ్లంతా అతని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. దాదాపు నిమిషం పాటు ఆ వ్యక్తి సలసల మరుగుతున్న ఆ జావ పాత్రలోనే ఉండిపోయాడు. 65 శాతం తీవ్రగాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. తమిళనాడులోని మధురైలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

తమిళనాడులో ‘ఆడి వెల్లి’ జాతర సందర్భంగా అమ్మవారి గౌరవార్థం జావను వండి.. ప్రజలకు పంచుతారు. గత శుక్రవారం మధురై పలగనాథంలో ముత్తు మారియమ్మ ఆలయం సమీపంలో భక్తులు కొందరు ఇళ్ల ముందరే మీదే పెద్ద పెద్ద వంట పాత్రల్లో జావను మరిగిస్తున్నారు. ఆ సమయంలో ముత్తుకుమార్‌ అనే ఓ వ్యక్తి మైకంతో అక్కడికి వచ్చాడు(తాగి ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు). తూలిపోతూనే ఆ గంజులో పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డయింది.

అతను పడిపోయే టైంలోనే చూసి కొందరు అరుస్తూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. జావ వేడిగా ఉన్నా.. మైకంలో ఉండిపోయిన ముత్తుకుమార్‌ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చివరికి తమ వల్ల కాకపోవడంతో స్థానికులు జావ పాత్రనే బోర్లించారు. కాలిన గాయాలతో పైకి లేచిన ముత్తుకుమార్‌ను స్థానికులు రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.