ఏపీలో ఓ మందుబాబు పూటుగా తాగి బైక్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి పోలీసులుకు పట్టుబడ్డాడు. సీఐ గోవిందరాజు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పీకల వరకు మద్యం తాగి బైక్పై షికారుకు బయలుదేరాడు. బైక్ పై గింగరాలు కొడుతూ హడావిడి చేస్తూ పోలీసులకు చిక్కాడు. పూర్తి మద్యం మత్తులో ఉన్న అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించిన సీఐ.. రీడింగ్ పర్సంటేజీ చూసి షాక్కు గురయ్యారు. అందులో ఏకంగా 530 పాయింట్లు చూపించడంతో అక్కడున్న పోలీసులు ఆశ్చర్యపోయారు.
15కుపైగా బీర్లు తాగితే తప్ప అంత రీడింగ్ రాదని, అతడి వాహనాన్ని సీజ్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు సీఐ వెల్లడించారు. అతడు తమకు చిక్కడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడని, వేరే మార్గంలో వెళ్లి ఉంటే ప్రమాదం జరిగి తన ప్రాణాలతో పాటు ఇతరుకు కూడా హాని కలిగుండేదన్నారు.