మొన్నటికి మొన్న ఫ్రెండ్స్ తో అమేజాన్ రెయిన్ ఫారెస్ట్ కు సాహస యాత్రకు వెళ్లి తప్పిపోయిన ఓ వ్యక్తి , 31 రోజులు సుదీర్ఘప్రయాణం చేసి వానపాములు తిని, వర్షపు నీరు తాగి సర్వైవ్ అయ్యాడు. ఇలాంటి ఇన్సిడెంటే మరొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇతను మాత్రం తప్పిపోయింది ఫారెస్ట్ లో కాదు. సముద్రంలో చిక్కుకుని ఏకంగా 24 రోజులు తల్లడిల్లాడు. తినడానికి తిండి లేదు, తాగడానికి మంచి నీరు లేదు. చుట్టుపక్కన పలకరించేందుకు ఒక్క పురుగు కూడా లేదు. ఒంటరి పోరాటం చేసి ఒడ్డుకు చేరి ఓ సాహస యాత్ర చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు ఓ నావికుడు.
ఒక్క పూట బ్రేక్ ఫాస్ట్ చేయకపోతేనే నానా హంగామా చేస్తుంటాము. కిందా మీద పడిపోతుంటాము. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 రోజులు తినడానికి తిండి లేక కేవలం తన దగ్గర ఉన్న కెచప్ తిని బ్రతికేశాడు ఓ వ్యక్తి. అవును ఇది నిజమే. సముద్రంలో తాను నడిపే నావ నిలిచిపోవడంతో ఒడ్డుకు చేరేంత వరకు ఆ వ్యక్తి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది.
కరేబియన్ ఐల్యాండ్ లోని డొమినికన్ కు చెందిన 47 ఏళ్ల ఎల్విస్ ఫ్రాంకోయిస్ సముద్రంలో తప్పిపోయాడు. డిసెంబరులో అతను నెదర్లాండ్స్ యాంటిలిస్‌లోని సెయింట్ మార్టిన్ ద్వీపంలో తన నావకు మరమ్మతులు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వాతవరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఎల్విస్ నావతో సహా సముద్రంలో తప్పిపోయాడు. స్నేహితులకు కాల్ చేద్దామన్నా ఫోన్ లో సిగ్నల్స్ లేవు. సహాయం కోసం ఎవరైనా ఉన్నారేమోనని వెతికినా ఎవరూ కనిపించలేదు. దీంతో చేసేదేమీ లేక కరేబియన్ సముద్రంలో ఈ నావికుడు 24 రోజులు ఆహారం లేకుండా కేవలం కెచప్ తిని సర్వైవ్ అయ్యాడు. ఎవరైనా ఇటుగా వచ్చి కాపాడుతారేమోనని వేయి కళ్లతో ఎదురుచూశాడు.
“నేను నా స్నేహితులను పిలిచాను, వారికి కాల్ చేశాను, కానీ నా ఫోన్ లో సిగ్నల్ లేదు. కూర్చుని, ఎదురుచూడటం తప్ప నేను చేయాల్సింది ఏమీ లేదని గ్రహించాను. ఆకలి నన్న తీవ్రంగా బాధించింది. తినేందుకు ఏమీ లేవు. తాగేందుకు మంచి నీరు లేదు. నావ లో ఉన్న కెచప్ ను, వెల్లుల్లి పొడే నా కడుపు నింపింది. 24 రోజులు అవే తిన్నాను అని తన అనుభవాలను తెలిపాడు ఎల్విస్. నావ పైనుంచి విమానం వెళుతుంటే ఎల్విస్ నావలోని అద్దాన్ని సిగ్నల్ గా వాడి సహాయం కోసం అర్ధించాడని నావీ అఫీషియల్స్ తెలిపారు. ఎట్టకేలకు ఎల్విస్ ను రెస్క్యూ చేసి అతడికి చికిత్స అందిస్తున్నారు నావీ అధికారులు. ప్రస్తుతం ఎల్విస్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు.