స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక.. చితిలోకి దూకాడు.. చివరికి!
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుడు.. క్యాన్సర్‌తో చనిపోయాడు. ఆ వార్త విని ఒక్కసారిగా పిచ్చోడైపోయాడు. ‘వాడు లేక నేనెలా ఉండేది’ అనుకున్నాడు. అంతే.. స్నేహితుడి చితికి పెట్టిన నిప్పులోనే దూకాడు. ప్రాణాలతో పోరాడి చివరికి చనిపోయాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లా, నాగ్లా ఖంగార్ లో జరిగింది.
గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న 42 ఏళ్ల అశోక్.. శనివారం (మే 28) ఉదయం మరణించాడు. ఈ నేపథ్యంలో అతని అంత్యక్రియలు యమునా నది ఒడ్డున ఉన్న ఓ స్మశాన వాటికలో ఉదయం 11 గంటలకు జరిగాయి. ఆ కార్యక్రమానికి అశోక్ చిన్ననాటి స్నేహితుడు ఆనంద్ (40 ఏళ్లు) కూడా హాజరయ్యాడు. అశోక్ చితికి నిప్పంటించిన తర్వాత అతని బంధువులు అక్కడినుంచి వెళ్లిపోయారు.
స్నేహితుడి మరణం తట్టుకోలేని ఆనంద్ ఒక్కసారిగా చితిలో దూకి, సహగమనానికి ప్రయత్నించాడు. అది చూసిన బంధువులు అప్రమత్తమై ఆనంద్ ను చితినుంచి పక్కకు లాగారు. అయితే, అప్పటికే ఆనంద్ శరీరానికి మంటలు అంటుకుని తీవ్రంగా కాలిపోయింది. దాంతో ఆనంద్ ను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు ఆగ్రా హాస్పిటల్ కు రిఫర్ చేశారు. ఆనంద్ ను ఆగ్రాకు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే చనిపోయాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు స్నేహితలు ప్రేమ చూసి నివ్వెరపోయారు.