‘నాలుగు రోజుల్లో నా కొడుకు రాకపోతే ఆస్తి మొత్తం నీపేరున రాస్తా’ - MicTv.in - Telugu News
mictv telugu

‘నాలుగు రోజుల్లో నా కొడుకు రాకపోతే ఆస్తి మొత్తం నీపేరున రాస్తా’

May 10, 2022

భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత తన ఇద్దరు పిల్లలతో ప్రియుడితో కలిసి లేచిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేష్, పావని దంపతులను ఇద్దరు పిల్లలు. అదే గ్రామానికి చెందిన విశ్వనాథ్, పరమేశ్‌లు స్నేహితులు. పరమేష్ కోసం ఇంటికి తరచూ వచ్చే విశ్వనాథ్ అతని భార్య పావనితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది గమనించిన పరమేష్ గ్రామంలో పంచాయితీ పెట్టించగా, అప్పటినుంచి విశ్వనాథ్, పావినిలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్‌కు మూడు నెలల క్రితం పెళ్లయింది. పావని మీద ప్రేమతో విశ్వనాథ్ తన భార్యతో సరిగ్గా ఉండేవాడు కాదు. ఈ నేపథ్యంలో గత నెల 30న విశ్వనాథ్, పావనిలు పిల్లలతో సహా పారిపోయారు. దీంతో పరమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో నాలుగు తులాల బంగారం, రూ. 43 వేలను తమతో పాటు తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసును విచారిస్తున్నారు. వారి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, కొత్తగా కాపురానికి వచ్చిన విశ్వనాథ్ భార్య తన పరిస్థితిపై మామగారిని నిలదీసింది. నీ కొడుకు పారిపోయాడు, నన్నేం చేయమంటావు? అని గట్టిగా ప్రశ్నించింది. దాంతో విశ్వనాథ తండ్రి ‘నాలుగు రోజులు వేచి చూస్తాను. ఆ లోగా నా కొడుకు తిరిగి రాకపోతే ఆస్తి మొత్తం నీ పేరున రాస్తా’నని హామీ ఇచ్చాడు. కాగా, తన భర్త ఆచూకీ తెలుసుకోవాలని విశ్వనాథ్ భార్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు విశ్వానథ్, పావనిల కోసం వెతుకుతున్నారు.