కోతులతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది. మంగళవారం సాయంత్రం అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా భోర్ నుంచి కొంకణ్ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వరందా ఘాట్ రోడ్లో ఉన్న వాఘ్జాయ్ గుడి వద్ద కారును ఆపాడు, ఆ గుడి ప్రాంతంలో కోతుల గుంపు కనిపించడంతో వాటితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. ముందు నుంచి సెల్ఫీ తీసుకునే క్రమంలో వెనుక ఏముందో గుర్తించలేకపోయాడు. దాదాపు 500 అడుగుల లోతైన లోయలో పడి మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతనికోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో లోయలో 500 మీటర్ల దిగువన అతని మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సహాయంతో బుధవారం తెల్లవారుజామున అతడిని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అబ్దుల్ ప్రాణాలు కోల్పోవడంతో.. అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.