పశ్చిమ బెంగాల్ లో ఉచితంగా తీసుకెళ్లాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ వాళ్లు మూడు వేలు డిమాండ్ చేశారు. అన్ని డబ్బులు కట్టలేక ఒక కొడుకు తల్లి శవాన్ని భుజాన మోసుకొని వెళ్లాడు. ప్రభుత్వ అంబులెన్స్ సేవలు ఉచితం. దీన్ని పేదవాడి వాహనంగా చెబుతారు. ఇది నిజంగా నిజమేనా? పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగి ఒక సంఘటన దేశంలోని అంబులెన్స్ సేవలను మరొకసారి ప్రశ్నించేదిగా ఉంది.
పశ్చిమ బెంగాల్ లోని జల్ పైగురి జిల్లాకు చెందిన వ్యక్తి 3వేల రూపాయలు చెల్లించలేక అంబులెన్స్ సేవలను వద్దనుకున్నాడు. దీంతో తల్లి మృతదేహాన్ని తన వయసు పై బడిన తండ్రితో కలిసి కొన్నికిలోమీటర్ల మేర భుజానికెత్తుకొని తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలను ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే ఒక సామాజిక సంస్థ స్పందించి వారికి ఉచిత అంబులెన్స్ ను పంపింది. కానీ అప్పటికే వారు కొన్ని కిలోమీటర్ల మేర నడిచారు. ఈ ఘటన చూసిన వాళ్లంతా వెనుకబడిన వర్గాలకు దేశంలో ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి వస్తుందా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
గౌరవప్రదమైన మరణం..
నాగర్ దంగి ప్రాంతానికి చెందిన రామ్ ప్రసాద్ దివాన్ తన తల్లి లక్ష్మీ రాణి దివాన్ (72) మృతదేహాన్ని భుజాలపై వేసుకొని వెళ్లాడు. లక్ష్మీదేవి జనవరి 4న తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో జల్పైగురి మెడికల్ కాలేజీలో చేర్పించారు. అప్పటికే అంబులెన్స్ కోసం 900 రూపాయలు ఖర్చు చేశాడు. కానీ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించింది. జల్ పై గురి మెడికల్ కాలేజీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో తన నివాసానికి వెళ్లాలంటే అంబులెన్స్ వాళ్లు 3వేల రూపాయలు చెల్లించమని అడిగారు. దీంతో బెడ్ షీట్ లో మృతదేహాన్ని చుట్టి తీసుకెళ్లాడు. అయితే ఈ విషయం తెలిసిన సూపరింటెండెంట్ కాస్త ఆలస్యంగా స్పందించారు.
ఇలాంటి సంఘటనలే..
గతంలో కూడా పేదలకు అంబులెన్స్ సేవలకు సంబంధించిన పలు కేసులు వెలుగులోకి వచ్చాయి. 2022లో ఒడిశాకు చెందిన వ్యక్తి నిస్సహాయంగా మరణించిన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కిలోమీటర్ల మేర నడిచాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక వ్యక్తి 90కిలోమీటర్లకు 20వేల రూపాయలు డిమాండ్ చేయడంతో తన కొడుకు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఇలాంటి సంఘటనలు విన్నా, చూసినా రోజురోజుకీ మానవత్వం చచ్చిపోతుందేమో అనిపిస్తున్నది కదా!